DK Aruna: కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారారు: డీకే అరుణ
- అల్లు అర్జున్ నివాసంపై దాడిని బీజేపీ ఖండిస్తోందన్న డీకే అరుణ
- అల్లు అర్జున్ ను బలిపశువు చేశారని వ్యాఖ్య
- సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సరికాదన్న బీజేపీ ఎంపీ
సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ ఖండిస్తోందని ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇలాంటి దాడులను ఎవరూ సమర్థించరని చెప్పారు. పోలీసు అధికారులు ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందనిపిస్తోందని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారారని డీకే అరుణ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని చెప్పారు. సీఎం పేరు మర్చిపోయానని అల్లు అర్జున్ అనడాన్ని కేటీఆర్ ట్రోల్ చేశారని... అందుకే అల్లు అర్జున్ ని రేవంత్ టార్గెట్ చేశారని విమర్శించారు.
అల్లు అర్జున్ ని బలిపశువు చేశారని డీకే అరుణ అన్నారు. మీకు, కేటీఆర్ కు మధ్య ఉన్న వైరాన్ని సినిమా వాళ్లపై చూపవద్దని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. సినీ ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడి తప్పాయని విమర్శించారు.