Ponnam Prabhakar: ఎన్టీఆర్ ను విమర్శిస్తే మీరు ఊరుకుంటారా?: పురందేశ్వరిపై తెలంగాణ మంత్రి పొన్నం విమర్శలు
- అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా రచ్చ
- ఏమీ ఎరగనట్టు పురందేశ్వరి మాట్లాడుతున్నారన్న పొన్నం
- రాహుల్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై మండిపాటు
పార్లమెంట్ సమావేశాల్లో అంబేద్కర్ గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ తో పాటు పలు విపక్ష పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అమిత్ షా వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయసభలు అట్టుడికాయి. దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి.
ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో అంబేద్కర్ ను విమర్శించినట్టు ఎన్టీఆర్ ను విమర్శిస్తే పురందేశ్వరి ఊరుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ ను అమిత్ షా విమర్శించినా... ఏమీ ఎరగనట్టు పురందేశ్వరి మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఎంత వరకు సబబు? అని పొన్నం ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు రాజకీయాలు చేయదని చెప్పారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై స్పందిస్తూ... ఏం జరిగిందనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించారని తెలిపారు.