Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులకు రిమాండ్.. బెయిల్!
- బన్నీ ఇంటిపై దాడి చేసిన ఆరుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్
- వెంటనే బెయిల్ పిటిషన్.. బెయిల్ మంజూరు
- నిందితులపై బీఎన్ఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసు
నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఆదివారం నాడు బన్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేశ్, ప్రేమ్ కుమార్, ప్రకాశ్ దాడి చేసిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై బీఎన్ఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈరోజు వారిని మెజిస్ట్రేజ్ ఎదుట హాజరపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేజ్ వారికి బెయిల్ మంజూరు చేశారు.
ఇక నిన్న అక్రమంగా బన్నీ ఇంటి గేటులోకి ప్రవేశించి ఓయూ జేఏసీ నేతలు టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. పూల కుండీలను పగలగొట్టి విధ్వంసం సృష్టించారు. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ నినాదాలు చేసుకుంటూ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో అల్లు అర్జున్ కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఆరుగురిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు.