Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫైనల్ కు చేరితే మ్యాచ్ జరిగేది ఎక్కడంటే..!
- చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం
- భారత జట్టు ఫైనల్‌కు చేరకుంటే లాహోర్‌లో ఫైనల్ మ్యాచ్
- 2027లో భారత్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ కూడా హైబ్రిడ్ మోడల్లోనే
- మహిళల ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ కూడా ఇదే మోడల్లో నిర్వహణ
చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు కనుక సెమీ ఫైనల్‌కు, ఆపై ఫైనల్‌కు దూసుకెళ్తే ఆ మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తారు. చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండటం, అక్కడికి వెళ్లేందుకు భారత జట్టు నిరాకరించడంతో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కొంతకాలంగా గందరగోళం నెలకొంది. తటస్థ వేదికకు బీసీసీఐ పట్టుబట్టడం, అందుకు పీసీబీ అంగీకరించకపోవడంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. చివరికి పాక్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించడంతో సమస్య కొలిక్కి వచ్చింది.
గత గురువారం ఈ విషయంలో పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. భారత జట్టు తన మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో కాకుండా తటస్థ వేదికపై ఆడుతుందని ఐసీసీ ప్రకటించింది. అంతేకాదు, 2027లో భారత్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇలాంటి ఏర్పాట్లే జరుగుతాయని ప్రకటించింది. అంటే.. ఆ టోర్నీలో పాక్ ఆడే మ్యాచ్‌లను కూడా తటస్థ వేదికలపై నిర్వహించే అవకాశం ఉంది.
చాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ నేడో, రేపో విడుదల చేసే అవకాశం ఉంది. పాకిస్థాన్ 9, 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. భారత జట్టు కనుక ఫైనల్‌కు చేరకుంటే లాహోర్‌లో ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఒకవేళ, భారత్ ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్‌లో జరుగుతుంది. ఈ చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో భారత్, శ్రీలంకలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లను కూడా హైబ్రిడ్ విధానంలోనే నిర్వహిస్తారు.