Ram Charan: ఆ టైంలో ఆయనతో మాట్లాడేందుకు కూడా చాలా టెన్షన్ పడ్డాను: రామ్ చరణ్
- అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- డాలస్ లో చారిత్రాత్మక రీతిలో సినీ వేడుక
- శంకర్ ను కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అభివర్ణించిన రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు.
ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేశ్ కల్లేపల్లి ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ, ఆసక్తికర అంశం వెల్లడించారు.
"శంకర్ గారు చేసిన 'స్నేహితుడు' సినిమా ఈవెంట్ కు గెస్టుగా వెళ్లాను. ఆ టైంలో ఆయనతో మాట్లాడేందుకు కూడా చాలా టెన్షన్ పడ్డాను. నాతో కాకపోయినా ఎవరితో అయినా సరే ఓ తెలుగు సినిమా చేయండని అడుగుదామని కూడా అడగలేకపోయాను. శంకర్ నిజంగా కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పాలి.
క్రికెట్‌కు సచిన్ ఎలాగో... ఇండియన్ సినిమాకు శంకర్ గారు అలాగ! డైరెక్టర్లకే డైరెక్టర్ ఆయన. అలాంటి శంకర్ గారితో పని చేయడం నా అదృష్టం. నా నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ మూవీ ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు. ఏం సాధించాలన్నా సహనం ఉండాలి.
పుష్ప 2తో సుకుమార్ గారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అలాంటి సుకుమార్ గారు మా ఈవెంట్‌కు వచ్చి మాట్లాడటం ఆనందంగా ఉంది. దిల్ రాజు గారితో పని చేయడం ఆనందంగా ఉంది" అని అన్నారు.