Heel pain: ఉదయం లేవగానే మడమ నొప్పా... ‘ప్లాంటార్​ ఫాసిటిస్​’ కావొచ్చు!

have pain in heels while waking up do this

  • కాలి మడమ నుంచి వేళ్ల వరకు నొప్పి ఉంటుందంటున్న నిపుణులు
  • సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే దీర్ఘకాలం ఇబ్బందులు
  • కాస్త నొప్పి తగ్గినంత మాత్రాన నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిక

కొందరిలో ఉదయం నిద్ర లేవగానే కాలి మడమల్లో నొప్పిగా అనిపిస్తుంటుంది. నడవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంతసేపటి తర్వాత ఆ నొప్పి తగ్గిపోతుంది. కానీ మళ్లీ మరుసటి రోజుగానీ, కొన్ని రోజుల తర్వాత గానీ ఉదయమే ఇలా నొప్పి వస్తుంటుంది. దీనికి కారణాలు ఏమిటి? ఉపశమనం పొందాలంటే ఏం చేయాలనే దానిపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

అది ప్లాంటార్ ఫాసిటిస్ సమస్య...
కాలి చీలమండ దిగువన మడమ, వేళ్ల వెనుక భాగంలో తీవ్రంగా నొప్పి రావడాన్ని ‘ప్లాంటార్ ఫాసిటిస్’ అంటారు. కాలి మడమను వేళ్లతో కలిపే ‘ప్లాంటార్ ఫాసియా’ అనే లిగమెంట్ లో సమస్యలు ఏర్పడినప్పుడు ఈ ఇబ్బంది తలెత్తుతుంది.

దేనివల్ల ఈ సమస్య వస్తుంది?
తరచూ పాదాలపై తీవ్ర ఒత్తిడి పడే పనులు చేయడం... అంటే జాగింగ్, ఎక్కువసేపు నిలబడే ఉండటం, ఎక్కువగా మెట్లు ఎక్కిదిగడం వంటివి చేయడం వల్ల లిగమెంట్లపై ఒత్తిడి పడి ‘ప్లాంటార్ ఫాసిటిస్’ సమస్య వస్తుంది. అది తాత్కాలికమైన ఇబ్బంది. ఇక పాదాల అడుగుభాగం సమతలంగా ఉండటం, లేదా మధ్యలో ఎక్కువ ఎత్తుగా ఉండటం, ఊబకాయం వంటి సందర్భాల్లో కూడా ‘ప్లాంటార్ ఫాసిటిస్’ సమస్య వస్తుంది.

ఉపశమనం కోసం ఏం చేయాలి?
ఈ సమస్య నుంచి ఉపశమనం లభించాలంటే... పాదాలపై ఒత్తిడి పడకుండా వీలైనంతగా విశ్రాంతి తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ సేపు నిలబడటం, పరుగెత్తడం వంటివి చేస్తే... లిగమెంట్లు మరింతగా దెబ్బతిని, నొప్పి చాలా కాలం కొనసాగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కాస్త నొప్పి తగ్గగానే నిర్లక్ష్యం చేయవద్దు
‘ప్లాంటార్ ఫాసిటిస్’ సమస్య పూర్తిగా తగ్గడానికి ఎక్కువ సమయమే పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల నొప్పి కొంత తగ్గగానే... పాదాలపై ఒత్తిడి పడే పనులు చేయవద్దని స్పష్టం చేస్తున్నారు. ఈ సమస్య పూర్తిగా తగ్గడానికి కనీసం ఒకటి, రెండు వారాల నుంచి రెండు నెలల వరకు పట్టవచ్చని పేర్కొంటున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రయోజనం
కాలి పాదాలకు తగినట్టుగా సరైన ఆకృతి ఉండే చెప్పులు, షూ ధరించాలి. ఈ ఇబ్బంది ఉన్నవారు చెప్పులు, షూ లేకుండా నడవకూడదు. దానివల్ల ఇబ్బంది మరింత పెరుగుతుంది. రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు గోరువెచ్చని ఆవ నూనెతో మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కొన్నిసార్లు పాదాల్లో కండరాలు పట్టేయడం వల్ల కూడా ‘ప్లాంటార్ ఫాసిటిస్’ సమస్య వస్తుందని... అందువల్ల పాదాలను ముందుకు, వెనక్కి మెల్లగా వంచడం వంటి స్ట్రెచింగ్ ఎక్సర్ సైజ్ చేయాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News