Car Flips: గాల్లో 8 పల్టీలు కొట్టిన కారు.. ప్యాసింజర్లు అంతా క్షేమం.. వీడియో ఇదిగో!

Car Flips 8 Times In Bikaner But No One Hurt

  • రాజస్థాన్ లోని బికనేర్ లో ప్రమాదం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • కారులో నుంచి బయటపడ్డ తర్వాత టీ అడిగిన ప్రయాణికులు

రాజస్థాన్ లోని బికనేర్ లో ఓ కారు అదుపుతప్పి గాలిలో పల్టీలు కొట్టింది. ఏకంగా ఎనిమిదిసార్లు పల్టీలు కొట్టి ఓ కార్ షోరూం గేటుపై పడింది. ఈ ప్రమాదం చూసిన స్థానికులు ఆ కారులోని వాళ్లు ప్రాణాలతో ఉండే అవకాశమే లేదని భావించారు. ఆశ్చర్యకరంగా ఆ కారులో ఉన్న ఐదుగురూ క్షేమంగా బయటపడ్డారు. ఒక్కరికీ చిన్న గాయం కూడా కాకపోవడం విశేషం. ప్రమాదం తర్వాత బయటకు వచ్చిన ఆ ప్రయాణికులు.. కారు షోరూంలోకి వెళ్లి టీ కావాలని అడగడంతో అక్కడి సిబ్బంది అవాక్కయ్యారు. అంతపెద్ద ప్రమాదం నుంచి బయటపడి తీరిగ్గా టీ కావాలని అడుగుతుండడంతో ఆశ్చర్యపోయామని చెప్పారు.

ఏంజరిగిందంటే..
నాగౌర్ కు చెందిన ఐదుగురు వ్యక్తులు శుక్రవారం కారులో బికనేర్ బయలుదేరారు. మార్గమధ్యంలో ఓ మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో వేగం ఎక్కువగా ఉండడంతో కారు ఎనిమిది పల్టీలు కొట్టి ఓ కార్ల షోరూం గేటుపై బోల్తాపడింది. కారు పల్టీ కొడుతున్నపుడే డ్రైవర్ సహా ఇద్దరు బయటకు దూకేయగా.. మిగతా వారు అందులోనే ఉండిపోయారు. ప్రమాదం జరిగిన తీరు స్థానికులను భయాందోళనకు గురిచేసింది.

ఆ కారులో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండే అవకాశం లేదని భావించారు. అయితే, కారు గేటుపై పడి ఆగిన తర్వాత అందులోని వారు క్షేమంగా బయటకు వచ్చారు. తమ షోరూంలోకి వచ్చి టీ కావాలని అడగడంతో ఆశ్చర్యపోయామని కార్ షోరూం సిబ్బంది చెప్పారు. షోరూం ముందున్న సీసీటీవీ కెమెరాలో ఈ ప్రమాదం రికార్డు కాగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News