Amaravati: అమరావతిని అడ్డుకునే ప్రయత్నం: ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు!
- రాజధాని నిర్మాణానికి భూసమీకరణ చట్ట విరుద్ధమని ఆరోపణ
- రైతుల్ని బెదిరించి, భయపెట్టి సంతకాలు చేయించుకున్నారని లేఖ
- అక్కడి ప్రజలు జీవనభృతిని కోల్పోయారని ఆరోపణ
- 2014-19 మధ్య కూడా ఇలాంటి ఆరోపణలతోనే లేఖ
- అప్పట్లో ఆ ఆరోపణలు నిజం కాదని నిగ్గు తేల్చిన ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) కలిసి రూ. 15 వేల కోట్ల రుణం ఇస్తుండటంతో గుర్తు తెలియని వ్యక్తులు మళ్లీ తెరమీదికి వచ్చారు. ఈ నెల 18న ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానెల్‌కు లేఖ రాస్తూ.. రాజధాని నిర్మాణానికి భూసమీకరణ చేయడం చట్టవిరుద్ధమని, రైతుల్ని బెదిరించి, భయపెట్టి సంతకాలు చేయించుకున్నారని అందులో ఫిర్యాదు చేశారు.
ఈ కారణంగా అక్కడి ప్రజలు జీవనభృతిని కోల్పోయారని, ఆహార భద్రతకు విఘాతం కలుగుతోందని అసత్య ఆరోపణలు చేశారు. పర్యావరణ, సామాజిక, ఆర్థిక అసమానతలు కూడా తలెత్తుతాయని పేర్కొన్నారు. రైతులతో అర్థవతమైన చర్చలు జరగలేదని, ఆ సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచారని ఆరోపించారు. అంతేకాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిర్మాణ కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు.
అప్పుడూ ఇవే ఆరోపణలు
చంద్రబాబునాయుడు హయాంలో 2014-19 మధ్య కూడా అమరావతి విషయంలో ఇలానే లేఖలు రాసి నిధులు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్ ప్యానెల్ ను నియమించి ఫిర్యాదులోని ఆరోపణలు నిజం కాదని నిగ్గు తేల్చింది. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం ప్రపంచబ్యాంకు రుణాన్ని తిరస్కరించింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అమరావతి నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతుండడంతో నాటి శక్తులు మళ్లీ నేడు జూలు విదిల్చినట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.