Nara Bhuvaneswari: మహిళలు డబ్బు కోసం దేహీ అనకూడదు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari tour continues in Kuppam constituency

  • కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన
  • మూడో రోజున శాంతిపురం, మొరసనపల్లిలో పలు కార్యక్రమాలకు హాజరు 
  • డ్వాక్రా మహిళలతో ముఖాముఖి

మహిళలు ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకోకూడదు. అవకాశాలు ఇవ్వాలేకానీ ఆడవారు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు. వారు ఎప్పుడూ డబ్బు కోసం దేహీ అనకూడదని అభిప్రాయపడ్డారు.  

కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 3వ రోజున ఆమె శాంతిపురం, మొరసనపల్లిలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం డ్వాక్రా మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ మగవాళ్లదేముంది... ఉద్యోగం చేయడం, ఇంటికొచ్చి భార్య వండింది తిని కూర్చోవడమే కదా అన్నారు. 

ఆడవాళ్లు అలా కాదు... ఒంటి చేత్తో ఏకకాలంలో 10 పనులు చక్కబెట్టగలరని. మగవాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేస్తూనే ఇంటి బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నారని, పిల్లల చదువులు చూసుకుంటున్నారని వివరించారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. 

 మహిళలను డ్వాక్రాకు ముందు, ఆ తర్వాతగా చూడాలి

మహిళలు అన్ని రంగాల్లో మగవారిని మించి విజయాలు సాధించాలని చంద్రబాబు గారు కోరుకుంటూ ఉంటారు. మహిళలు డబ్బు కోసం ఇబ్బంది పడకూడదని, వారు ఆర్థికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే డ్వాక్రా సంఘాలు స్థాపించారు. డ్వాక్రా ఏర్పాటుతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. 

ఒకప్పుడు వందా , రెండు వందల కోసం ఇతరులపై ఆధారపడిన స్త్రీలు నేడు బ్యాంకు లావాదేవీలు స్వయంగా చూసుకునే స్థాయికి చేరారంటే అది చంద్రబాబు గారు తీసుకొచ్చిన డ్వాక్రాతోనే సాధ్యమైంది. చంద్రబాబు గారిని అక్రమ కేసుతో అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు నా వెంట మహిళా లోకం నడిచింది. రాష్ట్రమంతటా మహిళలు పెద్దఎత్తున బయటకు వచ్చి సంఘీభావం తెలిపారు. 

నాకు హెరిటేజ్ బాధ్యతలు అప్పగించి పారిశ్రామికవేత్తను చేసింది చంద్రబాబు గారే. నేను ఇవాళ వేలమందికి ఉపాధి కల్పిస్తున్నానంటే అందుకు చంద్రబాబు గారి ప్రోత్సాహమే కారణం. 

కుప్పంలో అభివృద్ధి పరుగులు

కుప్పం నియోజకవర్గంలో మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు అనేక కంపెనీలు వస్తున్నాయి. శాంతిపురంలో పెద్ద కంపెనీ రాబోతోంది. దాని వల్ల మహిళలకు ఉపాధి లభిస్తుంది. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాము. మీకు ఎటువంటి సాయం కావాలన్న అడగండి. మహిళలకు చేయి అందించి పైకి తెచ్చేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. 

ఇవాళ నారా బ్రాహ్మణి గారి పుట్టినరోజు సందర్భంగా గ్రామస్థుల సమక్షంలో భువనేశ్వరి కేక్ కట్ చేశారు. చెక్కతో తయారుచేసిన సీఎం చంద్రబాబు, దేవాన్ష్ , భువనేశ్వరి గారి ఫోటో ఫ్రేమ్ ను గ్రామస్థులు బహుకరించారు. బెంగుళూరుకు చెందిన కనకమేడల వీరాంజనేయులు రూ. లక్ష చెల్లించి నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా టీడీపీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News