Srivari Darshan: గంటలో తిరుమల శ్రీవారి దర్శనం... వారం రోజుల పాటు పైలట్ ప్రాజెక్టు

Tirumala Srivari Darshan in one hour as TTD implements pilot project

  • సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని ఇటీవల ప్రకటించిన బీఆర్ నాయుడు
  • గంటలోపే దర్శనం కల్పిస్తామని వెల్లడి
  • మొదట ప్రయోగాత్మకంగా అమలు
  • ఏఐ సాంకేతికతతో నూతన విధానం 
  • విజయవంతమైతే టీటీడీ బోర్డు సమావేశంలో ఆమోద ముద్ర

తిరుమలలో భక్తులు గతంలో మాదిరిగా రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే ఇబ్బంది లేకుండా, గంటలోనే శ్రీవారి దర్శనం కల్పించేలా చేస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో, గంటలో శ్రీవారి దర్శనం కార్యాచరణకు తొలి అడుగు పడింది. వారం రోజుల పాటు చేపట్టే పైలట్ ప్రాజెక్టుకు నేడు శ్రీకారం చుట్టారు. గంటలోపే దర్శనం విధివిధానాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. 

మొదట భక్తుల ఆధార్ కార్డు నెంబర్, ఫేస్ రికాగ్నిషన్ తీసుకుని రసీదు ఇస్తారు. స్వామివారి దర్శన సమయాన్ని సూచిస్తూ ఒక టోకెన్ కూడా ఇస్తారు. టోకెన్ లో నిర్దేశించిన సమయానికి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోవాలి. ఫేస్ రికాగ్నిషన్ స్కానింగ్ అనంతరం వారిని క్యూలైన్ లోకి అనుమతిస్తారు. ఆ విధంగా క్యూలైన్ లోకి ప్రవేశించిన భక్తులు గంటలోపే శ్రీవారిని దర్శించుకుని ఆలయం నుంచి బయటికి వచ్చేస్తారు. 

ఈ తరహా టోకెన్ల జారీకి టీటీడీ 45 కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. సిబ్బందితో పనిలేకుండా ఏఐ టెక్నాలజీని విస్తరించాలని టీటీడీ భావిస్తోంది. నాలుగు విదేశీ సంస్థలు ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ముందుకు రాగా, ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. 

గంటలోపు దర్శనం పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే... ఈ నెల 24న జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఆమోద ముద్ర వేస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

  • Loading...

More Telugu News