Gold and Cash: వదిలేసి వెళ్లిన ఇన్నోవా కారులో 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల నగదు!

Huge amount of cash and gold found in abandoned car

  • భోపాల్ నగరంలో ఐటీ దాడులు
  • శివార్లలో నిలిపి ఉన్న కారును చుట్టుముట్టిన పోలీసు బలగాలు
  • కారులో భారీ మొత్తంలో నగదు, బంగారం లభ్యం

మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు, లోకాయుక్త పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. అటవీ మార్గం గుండా పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. నగర శివార్లలోని మెండోరీ ప్రాంతంలో వారికి నిలిపి ఉంచిన ఓ ఇన్నోవా కారు కనిపించింది. 

ఆ కారులో ఉన్నవారు తప్పించుకుపోకుండా 30 పోలీసు వాహనాలతో 100 మంది పోలీసులు చుట్టుముట్టారు. కారును తనిఖీ చేసిన అధికారులు నివ్వెరపోయారు. అందులో ఎవరూ లేకపోగా... ఏకంగా 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదు కనిపించాయి. బంగారం, నగదుతో ఉన్న రెండు బ్యాగులను ఆ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

ఆ ఇన్నోవా కారును గ్వాలియర్ కు చెందిన చేతన్ గౌర్, సౌరభ్ శర్మ అనే వ్యక్తులకు చెందినదిగా గుర్తించారు. వీరిలో సౌరభ్ శర్మ మాజీ కానిస్టేబుల్. గతంలో ఆర్టీవో ఆఫీసు వద్ద విధులు నిర్వర్తించాడు. 

కాగా, ఆదాయ పన్ను శాఖ అధికారుల రాడార్ లో పలువురు బిల్డర్లతో పాటు సౌరభ్ శర్మ కూడా ఉన్నాడు. భోపాల్ నగరంలోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న శర్మ నివాసంపై ఐటీ అధికారులు గురువారం నాడు దాడులు చేయగా, రూ.1 కోటి నగదు, అరకిలో బంగారం పట్టుబడ్డాయి. అంతేకాదు, విలువైన వజ్రాలు, వెండి కడ్డీలు, ఆస్తి పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

తాజాగా... అడవిలో వదిలేసి వెళ్లిన ఇన్నోవా కారులోని డబ్బు, బంగారం కూడా సౌరభ్ శర్మకు చెందినవి అయ్యుంటాయని భావిస్తున్నారు. అయితే, బంగారం, నగదు తమవే అంటూ ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో, అవి ఎవరికి చెందినవో నిగ్గుతేల్చేందుకు అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

Gold and Cash
Abandoned Car
Bhopal
IT Raids
Police
Madhya Pradesh
  • Loading...

More Telugu News