Sachin Tendulkar: ఈ అమ్మాయి అచ్చం జహీర్ లా బౌల్ చేస్తోందే... ఆసక్తికర వీడియో పంచుకున్న సచిన్

Sachin Tendulkar shares an interesting video of a girl bowling like Zaheer Khan

  • ఎడమచేతివాటంతో ఫాస్ట్ బౌలింగ్ చేస్తున్న సుశీలా మీనా అనే బాలిక
  • జహీర్... ఈ అమ్మాయి బౌలింగ్ చూశావా? అంటూ సచిన్ ట్వీట్
  • సచిన్ ట్వీట్ పై స్పందించిన ఆదిత్య బిర్లా గ్రూప్
  • బాలిక క్రికెట్ కెరీర్ కు ఆసరాగా నిలుస్తామని హామీ

భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు. సుశీలా మీనా అనే బాలిక ఎడమచేతివాటంతో ఫాస్ట్ బౌలింగ్  వేస్తుండాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. విశేషం ఏంటంటే... ఆ అమ్మాయి బౌలింగ్ చూస్తే టీమిండియా మాజీ లెజెండ్ జహీర్ ఖాన్ బౌలింగ్ యాక్షన్ గుర్తుకువస్తుంది. సచిన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

"ఎంతో సరళంగా, పెద్దగా శ్రమ పడకుండా ఈ అమ్మాయి బౌలింగ్ చేయడం చూడముచ్చటగా ఉంది. జహీర్ ఖాన్... సుశీలా మీనా అనే ఈ అమ్మాయి బౌలింగ్ లో నీ ఛాయలు కనిపిస్తున్నాయి... నువ్వు కూడా ఈ వీడియో చూశావా?" అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. 

కాగా, సచిన్ పంచుకున్న ఈ వీడియోపై ప్రముఖ వ్యాపార సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ స్పందించింది. ఇటువంటి ప్రతిభావంతులను గుర్తించినందుకు సచిన్ ను అభినందించింది. సుశీలా మీనా బౌలింగ్ నైపుణ్యం ఎవరూ కాదనలేరని, తాము చేపట్టే ఫోకస్ ఫర్ గుడ్ కార్యక్రమం కింద ఆ బాలిక క్రికెట్ ప్రస్థానానికి చేయూతగా నిలుస్తామని హామీ ఇచ్చింది.

More Telugu News