Pawan Kalyan: ఇంకా సీఎం సీఎం అంటున్నారు... డిప్యూటీ సీఎం అయ్యాను కదా!: పవన్ కల్యాణ్

Pawan Kalyan take a class to supporters who shout out OG OG

  • ఉత్తరాంధ్రలో పవన్ పర్యటన
  • ఓ గిరిజన గ్రామంలో రోడ్డుకు శంకుస్థాపన
  • ఓజీ ఓజీ అంటూ జనాల అరుపులు
  • నన్ను పనిచేసుకోనివ్వండి అంటూ పవన్ చిరుకోపం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ పార్వతీపురం జిల్లాలోని గిరిజిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బాహుజోల అనే గిరిజన గ్రామంలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఓజీ ఓజీ... సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అయితే, ఆ అభిమానులపై పవన్ చిరు కోపం ప్రదర్శించారు. కొంచెం మందలిస్తున్న ధోరణిలో వ్యాఖ్యానించారు. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే... "నన్ను పని చేసుకోనివ్వండి. కనీసం రోడ్డు కూడా కనిపించనంతగా నా మీద పడిపోయారు. మీకందరికీ దణ్ణం పెడతాను... రోడ్డు చూడనివ్వండి నన్ను అని చెప్పాల్సి వచ్చింది. ఓజీ ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారు... లేకపోతే, ఇంతకుముందు సీఎం సీఎం అనేవాళ్లు... అదింకా పోలేదు... నేను డిప్యూటీ సీఎం అయినా గానీ వాళ్లకు ఆనందం కలగడంలేదు. 

అందరికీ నేను చెప్పేది ఒక్కటే... నేను వచ్చినప్పుడు అందరూ నన్ను చుట్టుముడితే పనులు జరగవు. నన్ను పనిచేయనివ్వండి. ఉత్తరాంధ్ర... ప్రజలకు తెలుగు వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు నేర్పించిన నేల ఇది, ఎవరైనా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. కానీ ఇవాళ మీరు సినిమాల మోజులో పడి... ఓజీ ఓజీ అని పోస్టర్లు పెట్టి, జేజేలు కొడితే జీవితంలో ముందుకు వెళ్లలేరు. 

మాట్లాడితే చాలు... అన్నా మీసం తిప్పు, మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్ల నిర్మాణం జరుగుతుందా? నేను ఛాతీ గుద్దుకుంటే రోడ్లు పడతాయా?... నేను వెళ్లి ప్రధానమంత్రి గారికి దణ్ణం పెట్టి, సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళితే రోడ్లు పడతాయి. అందుకే, మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతకావు... నాకు పనిచేయడమే తెలుసు" అంటూ పవన్ కల్యాణ్ అభిమానులకు హితోపదేశం చేశారు.

More Telugu News