Sukumar: బాలుడు శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన దర్శకుడు సుకుమార్
- పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా భారీ తొక్కిసలాట
- రేవతి అనే మహిళ మృతి... ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు
- బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఇప్పటికీ చికిత్స పొందుతుండడం తెలిసిందే. ఆ బాలుడి మెదడుకు డ్యామేజి జరిగిందని వైద్యులు చెబుతున్నారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇటీవల వెల్లడించారు.
ఈ నేపథ్యంలో, పుష్ప-2 దర్శకుడు సుకుమార్ నేడు బాలుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సుకుమార్ కిమ్స్ డాక్టర్లతో కూడా మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీసినట్టు తెలుస్తోంది.
కాగా, దర్శకుడు సుకుమార్ అర్ధాంగి తబిత ఈ నెల 9న బాలుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేశారు. ఇవాళ ఆసుపత్రిలో బాలుడి తండ్రితో మాట్లాడిన సుకుమార్... శ్రీతేజ్ వైద్య, విద్యా ఖర్చులకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.