GV Reddy: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రూ. 2.10 కోట్లు అక్రమంగా చెల్లించారు: జీవీ రెడ్డి
- ఏపీ ఫైబర్ నెట్ దివాళా అంచున ఉందన్న జీవీ రెడ్డి
- 'వ్యూహం' సినిమాను ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసి రూ. 2.10 కోట్లు ఇచ్చారని ఆరోపణ
- అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని వెల్లడి
ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుతం దివాళా అంచున ఉందని ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అప్పటి అధికారులు రూ. 2.10 కోట్లను అక్రమంగా చెల్లించారని చెప్పారు. 'వ్యూహం' సినిమాను ఫైబర్ నెట్ లో టెలికాస్ట్ చేసి... వర్మకు అక్రమ చెల్లింపులు చేశారని తెలిపారు. ఆ చిత్రానికి 18 లక్షల వ్యూస్ వచ్చినందుకు రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉండగా... రూ. 2.10 కోట్లు ఇచ్చారని దుయ్యబట్టారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫైబర్ నెట్ సంస్థలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లను వేధింపులకు గురి చేసిందని మండిపడ్డారు. అప్పటి ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జీవీ రెడ్డి తెలిపారు. వైసీపీ నేతల అక్రమాలు బయటపడకుండా కీలక పత్రాలను మార్చేశారని మండిపడ్డారు. కీలక దస్త్రాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఓ మహిళా ఉద్యోగి చేరవేశారని చెప్పారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించామని వెల్లడించారు.