Earthquake: రోడ్డు రోలర్ సౌండ్‌ను భూకంపంగా భ్రమపడి.. మొదటి అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థులు!

School Girls Mistake Road Roller Sound As Earthquake Jumps From School Building

  • పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఘటన
  • స్కూలు సమీపంలో రోడ్డు నిర్మాణ పనులు
  • రోడ్డు రోలర్ నుంచి వస్తున్న ప్రకంపనలను భూకంపంగా పొరబడిన విద్యార్థులు
  • ముగ్గురు బాలికల పరిస్థితి విషమం

రోడ్డు రోలర్ చేస్తున్న శబ్దాలను, దాని నుంచి వచ్చే ప్రకంపనలను భూకంపంగా భావించిన విద్యార్థులు బయపడిపోయి స్కూల్లోని మొదటి అంతస్తు నుంచి దూకేశారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో జరిగిందీ ఘటన. లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహానియన్, ఖనేవాల్ జిల్లాలోని ప్రభుత్వ బాలికల పాఠశాల సమీపంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో రోడ్డు రోలర్ నుంచి వస్తున్న శబ్దాలు, ప్రకంపనలను గుర్తించిన తరగతి గదిలోని కొందరు విద్యార్థులు భూకంపంగా భావించారు. వెంటనే తోటి విద్యార్థులను అప్రమత్తం చేశారు. దీంతో ఒక్కసారిగా తరగతి గదిలో గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలో క్లాసులో టీచరు కూడా లేకపోవడంతో కొందరు విద్యార్థులు మెట్ల మార్గం గుండా బయటకు పరుగులు తీశారు. 

12 నుంచి 14 ఏళ్ల వయసున్న 8 మంది బాలికలు మాత్రం భవనం కూలిపోతుందన్న భయంతో మొదటి అంతస్తులోని కిటికీ నుంచి కిందికి దూకేశారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. రోడ్డు రోలర్ శబ్దాలను భూకంపంగా పొరబడడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఘటన సమయంలో తరగతి గదిలో 20 మంది ఉన్నట్టు చెప్పారు.  

  • Loading...

More Telugu News