Self-made Entrepreneurs: ఈ 200 మంది స్వయం కృషితో ఎదిగిన శ్రీమంతులు!

Sriharsha Majety In The Third Place In IDFC Indias Top 200 Self made Entrepreneurs of the Millennia 2024

  • జాబితా విడుదల చేసిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్, హరూన్ ఇండియా
  • టాప్ ప్లేస్‌లో డీమార్ట్ అధిపతి రాధాకిషన్ దమానీ
  • మూడో స్థానంలో తెలుగువారైన శ్రీహర్ష మాజేటీ, నందన్‌రెడ్డి
  • జాబితాలో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా
  • 98 మంది పారిశ్రామకవేత్తలతో అగ్రస్థానంలో ఢిల్లీ

ఎవరి మద్దతు లేకుండా స్వయం కృషితో ఎదిగి సంపన్నులుగా మారిన 200 మంది వ్యాపారవేత్తల జాబితాను ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్, హరూన్ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. ‘ఇండియాస్ టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఆంత్రప్రెన్యూర్స్ ఆఫ్ ద మిలేనియా 2024’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో అవెన్యూ సూపర్ మార్ట్స్ (డీమార్ట్) అధిపతి రాధాకిషన్ దమానీ టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఆయన సంపద విలువ రూ. 3.42 లక్షల కోట్లు.

టాప్ ప్లేస్‌లో బెంగళూరు
ఈ ఏడాది సెప్టెంబర్ 25 నాటికి ఆయా కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఇందులో చోటు దక్కించుకున్న మొత్తం కంపెనీల విలువ రూ. 36 లక్షల కోట్లు. దేశవ్యాప్తంగా 46 నగరాలకు చెందిన వారికి ఈ జాబితాలో చోటు లభించింది. 98 మంది పారిశ్రామికవేత్తలతో బెంగళూరు ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ముంబై (73), న్యూఢిల్లీ (51) నిలిచాయి. ఈ మూడు నగరాల నుంచే దాదాపు సగం మంది ఈ జాబితాకెక్కారు. ఫైనాన్షియల్ రంగానికి చెందిన కంపెనీలు (50) ఈ జాబితాలో ఆధిపత్యం ప్రదర్శించగా ఆ తర్వాతి స్థానాల్లో హెల్త్‌కేర్, రిటైల్ రంగాలున్నాయి.

తెలుగువారికి మూడో స్థానం
200 మంది వ్యాపారవేత్తల జాబితాలోని మూడో స్థానంలో తెలుగువారైన స్విగ్గీ సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష మాజేటి, నందన్‌రెడ్డి ఉన్నారు. వీరు 52 శాతం వృద్ధితో రూ. లక్ష కోట్ల విలువను చేజిక్కించుకున్నారు. జొమాటో వ్యవస్థాపకుడు దీపీందర్ గోయల్ రెండో స్థానంలో నిలిచారు. ఆయన నికర సంపద గతేడాది కాలంలో 190 శాతం పెరిగింది. ఏడాది కాలంలో 100 శాతానికిపైగా సంపద పెంచుకున్న వారిలో మేక్‌మైట్రిప్ (168 శాతం), పాలసీబజార్ (128 శాతం) టాప్-10లో చేరాయి. మేక్‌మైట్రిప్ ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. 

అతి పిన్న వయస్కుడిగా కైవల్య
ఈ జాబితాలో అతి పిన్న వయస్కుడైన సంపన్నుడిగా జెప్టో వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా నిలిచారు. ఆయన వయసు 21 ఏళ్లు మాత్రమే. ఏడాది కాలంలో జెప్టో విలువ ఏకంగా 259 శాతం పెరిగి రూ. 41,800 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాతి స్థానంలోనూ జెప్టోకే చెందిన ఆదిత్ పలిచా నిలిచారు. ఆయన వయసు 22 ఏళ్లు. అలాగే, భారత్ పే వ్యవస్థాపకుడు శాశ్వత్ నక్రానీ ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆయన వయసు 26 ఏళ్లు.

  • Loading...

More Telugu News