Health: మూడ్​ స్వింగ్స్​ నుంచి చర్మ సమస్యల దాకా.. ఇదే వాటికి కారణం కావొచ్చు!

symptoms of vitamin b12 deficiency you shouldnt ignore

  • అన్ని రకాల పోషకాలు సరిగా అందితేనే పూర్తి ఆరోగ్యం
  • ముఖ్యంగా కొన్ని రకాల పోషకాలు శరీరానికి మరింత అత్యవసరం
  • వాటిలోపం వల్ల మానసిక, శారీరక సమస్యలూ వస్తాయంటున్న నిపుణులు

అన్ని రకాల పోషకాలు సరిగా అందితేనే శరీరంలోని వ్యవస్థలన్నీ సమర్థవంతంగా పనిచేస్తాయి. అందులోనూ కొన్ని రకాల పోషక పదార్థాలు అందకపోతే సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో ఎన్నో రకాల జీవక్రియలు వాటిపై ఆధారపడి ఉండటమే దీనికి కారణం. అలాంటి అత్యంత ముఖ్యమైన వాటిలో ‘విటమిన్ బీ12’ ఒకటి. దీని లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. మాంసం, చేపలు, గుడ్లు, పాలలో విటమిన్ బీ12 ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల శాకాహారుల్లో విటమిన్ బీ12 లోపం ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని లోపం వల్ల వచ్చే సమస్యలు ఏమిటంటే...

తరచూ మారిపోయే మూడ్ (మూడ్ స్వింగ్స్)
మన మెదడు అభివృద్ధికి, జ్ఞాపక శక్తికి విటమిన్ బీ 12 అత్యంత అవసరం. దీని లోపం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ బీ 12 లోపం ఎక్కువగా ఉంటే... మెమరీ లాస్, ఏకాగ్రత కోల్పోవడం, ఎప్పటికప్పుడు మూడ్ మారిపోవడం (మూడ్ స్వింగ్స్) వంటి మానసిక సమస్యలు ఏర్పడుతాయని హెచ్చరిస్తున్నారు.

తీవ్రమైన నోటి సమస్యలు
విటమిన్ బీ12 లోపం వల్ల నోటి సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటిలో అల్సర్లు, నాలుక వాపు, ఎర్రబడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

మహిళల్లో వంధ్యత్వం...

విటమిన్ బీ 12 లోపం మహిళల్లో వంధ్యత్వం (ఇన్ ఫెర్టిలిటీ)కి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నవారు దీని లోపం తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

రుచి, వాసన కోల్పోవడం...
విటమిన్ బీ12 లోపం వల్ల నాలుక వాపు, దానిపై ఉండే రుచి బుడిపెలు (టేస్ట్ బడ్స్) దెబ్బతినడం, ముక్కులోని వాసన చూడగల భాగం వాపు వల్ల... రుచి, వాసన చూసే శక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

చర్మం కాంతి విహీనం కావడం...
విటమిన్ బీ12 లోపం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయులు తగ్గుతాయి. దీనితో నీరసం, చర్మం కళావిహీనం కావడం, తలనొప్పి వంటి లక్షణాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లోపం ఎక్కువకాలం కొనసాగితే నాడీ వ్యవస్థపైనా ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

స్థిమితంగా నిలబడలేకపోవడం...
చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, నిలకడ కోల్పోవడం వంటి సమస్యలు కూడా బీ12 లోపం వల్ల వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గందరగోళం, మతిమరపు వంటి ఇబ్బందులూ వస్తాయని హెచ్చరిస్తున్నారు.

పురుషులలో అంగ స్తంభన సమస్య...
విటమిన్ బీ12 పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగా పనిచేయడానికి అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు. బీ12 లోపం వల్ల అంగ స్తంభన సమస్య, వంధ్యత్వం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని... విటమిన్ సరిపడా అందేలా చూసుకుంటే, సమస్యలు తగ్గిపోతాయని వివరిస్తున్నారు.

ఈ అంశాలను గుర్తుంచుకోండి
విటమిన్ బీ12 లోపం వల్ల రావొచ్చని పేర్కొన్న లక్షణాలు ఇతర వ్యాధులు, ఆరోగ్య సమస్యలతోనూ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తగిన వైద్య పరీక్షలు చేయించుకుంటే అసలు సమస్య ఏమిటో తెలుస్తుందని... తగిన మందులు వాడితే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. ఆహారంలో మార్పులు చేసుకోవడం, మందులు వాడటం అనేది ఆయా వ్యక్తుల శారీరక స్థితిని బట్టి ఉంటుందని... వైద్యుల సూచనల మేరకే వ్యవహరించాలని స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News