KTR: దమ్ముంటే ఫార్ములా ఈ-రేస్‌పై సభలో చర్చ పెట్టండి: రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

KTR writes letter to CM Revanth Reddy

  • ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ జరపాలన్న సీఎం
  • తెలంగాణకు మంచి జరగాలనే ఈ-రేసింగ్ నిర్వహించినట్లు వెల్లడి
  • రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంపై ఈ శాసనసభలోనే చర్చ జరపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. దమ్ముంటే చర్చ పెట్టాలని తాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఈ మేరకు ఆయన సీఎంకు రాసిన లేఖను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అసెంబ్లీలో చర్చ జరిగితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ వ్యవహారంలో గత కొన్ని నెలలుగా తనపై, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం, నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.

ఈ-రేస్ వ్యవహారంపై ఇటీవలి కేబినెట్ సమావేశంలోనూ సుదీర్ఘ చర్చ సాగినట్లు మీడియా కథనాలు వచ్చాయని, కేసులు నమోదు చేస్తామని, గవర్నర్ ఆమోదం తెలిపారంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు లీకులు వచ్చాయని తెలిపారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చించడం కంటే శాసనసభ వేదికగా నాలుగు కోట్ల మంది ప్రజలకు తెలిసేలా చర్చ జరిగితే బాగుంటుందన్నారు.

తెలంగాణకు, హైదరాబాద్‌కు మంచి జరగాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా రేస్ నిర్వహించాలని భావించిందని, 2023లో రేస్‌ను విజయవంతంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నట్లు తెలిపారు. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు నీల్సన్ సంస్థ నివేదిక కూడా తెలిపిందని ఆ లేఖలో గుర్తు చేశారు. ఈసారి కూడా ఈ రేస్ జరగాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందన్నారు. పైగా ప్రభుత్వం తమపై దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో చర్చిస్తే అన్ని విషయాలను వివరంగా చెబుతామన్నారు.

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి... ఏదో జరిగిందనే అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఫార్ములా ఈ-రేస్ పూర్తిగా పారదర్శకంగానే జరిగిందని తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర ప్రజలకు నిజానిజాలు తెలుసుకునే హక్కు ఉందని, శాసనసభలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాలని కోరుతూ తమ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ కూడా ఇచ్చారని సీఎంకు రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.

KTR
Revanth Reddy
Telangana
Congress
BRS
  • Loading...

More Telugu News