Allu Arjun: శ్రీతేజ్‌ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్
- సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్
- రెండు వారాలుగా కిమ్స్‌లో చికిత్స
- శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అల్లు అరవింద్
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ రెండు వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు చైతన్, విష్ణుతేజ్ నిన్న రాత్రి వెల్లడించారు. ఐసీయూలో వెంటిలెటర్‌పై ఉన్నట్లు చెప్పారు. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని, బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామన్నారు.