Daikin: ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద కర్మాగారం ఏపీలో ఏర్పాటు చేయనున్న డైకిన్
- వెయ్యి కోట్లతో శ్రీసిటీలో కంప్రెసర్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం
- తైవాన్ కు చెందిన రెచి కంపెనీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన
- మధ్యతరగతి ప్రజలకు చౌక ధరకే ఏసీలు అందిస్తామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు చెందిన ప్రముఖ కంపెనీ డైకిన్ ముందుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకొస్తామని ప్రకటించింది. తైవాన్ కు చెందిన రెచి ప్రెసిషన్ కంపెనీ భాగస్వామ్యంతో శ్రీసిటీలో కంప్రెసర్ల తయారీ యూనిట్ ను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. దాదాపు 75 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద యూనిట్ గా అవతరిస్తుందని పేర్కొంది. ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను ఇక్కడ తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది.
రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మెజారిటీ వాటాదారుగా డైకిన్ ఉంటుంది. శ్రీసిటీలో ఏర్పాటు చేయబోయే యూనిట్ తో కలిపి భారత్ లో మొత్తం మూడు యూనిట్లు నెలకొల్పినట్లు అవుతుందని డైకిన్ కంపెనీ వివరించింది. ప్రస్తుతం ఉన్న రెండు యూనిట్లతో కలిపి ఏటా 2 మిలియన్ కంప్రెసర్లను తయారుచేస్తున్నామని, 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందంతో దేశీయంగా మధ్యతరగతి ప్రజలకు చౌక ధరకే ఏసీలను అందించడం సాధ్యమవుతుందని, భారత మార్కెట్లో ఏసీ విక్రయాల్లో టాపర్ గా నిలవాలన్నదే తమ లక్ష్యమని డైకిన్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.