Balagam Venu: నా కెరియర్లో అసలైన కష్టకాలం అంటే అదే: 'బలగం' వేణు!
- 'జబర్దస్' వలన మంచి పేరు వచ్చిందన్న వేణు
- డబ్బుకు లోటు ఉండేది కాదని వెల్లడి
- ఆ షో నుంచి బయటికి వచ్చాక ఇబ్బంది పడ్డానని వివరణ
- మట్టి కథలపై ఆసక్తి ఎక్కువని స్పష్టం చేసిన వేణు
కమెడియన్ గా వేణు చాలా సినిమాలు చేశాడు. ఆ తరువాత కొంతకాలం పాటు 'జబర్దస్త్' స్టేజ్ పై సందడి చేసిన ఆయన, 'బలగం' సినిమాతో దర్శకుడిగాను తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు మరో సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. రీసెంటుగా 'ఐడ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
"ఒక వైపున సినిమాలు చేస్తూ నేను బిజీగా ఉన్న సమయంలోనే 'జబర్దస్త్'లో చేసే ఛాన్స్ వచ్చింది. నేను .. ధనరాజ్ కలిసి స్కిట్స్ చేసే వాళ్లం. ఆ షో వలన డబ్బుకు డబ్బు .. పేరుకు పేరు వచ్చేవి. అయితే నేను టీవీ షో వైపే బిజీగా ఉండిపోతే, సినిమాలకి దూరమవుతానని అనిపించి వెనక్కి వచ్చేశాను. అయితే నేను సినిమాలు చేయడం లేదనుకుని నన్ను పిలవడం తగ్గించారు. దాంతో రెండు వైపుల నుంచి గ్యాప్ వచ్చింది. ఆ నాలుగైదు సంవత్సరాల పాటు నేను చాలా ఇబ్బందులు పడ్డాను" అని అన్నాడు.
'బలగం' సినిమా .. దర్శకుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి నేను చాలా కష్టాలు పడవలసి వచ్చింది. దర్శకులు గడ్డాలు ఎందుకు పెంచుతారనేది నాకు అర్థమైంది. నాకు మట్టి కథలు అంటేనే ఇష్టం. అందువలన ఆ తరహా కథలను తెరపైకి తీసుకురావడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. నటుడిగా కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. రెండో సినిమా రిలీజ్ తరువాత నటన గురించిన ఆలోచన చేస్తాను" అని చెప్పాడు.