One Nation One Election: జమిలి ఎన్నికల బిల్లు పరిశీలనకు జేపీసీ ఎందుకు? అసలు ఈ కమిటీ ఏం చేస్తుంది?

What One Nation One Poll JPC Will Do

  • కమిటీలో గరిష్ఠంగా 31 మంది సభ్యులకు అవకాశం
  • ఎంపీల సంఖ్య ఆధారంగా అన్ని రాజకీయ పార్టీలకు కమిటీలో ప్రాతినిధ్యం
  • కమిటీలో చోటు దక్కని ఎంపీలు, న్యాయ, రాజ్యాంగ నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణ
  • సాధారణ పౌరుల స్పందనలు కూడా తెలుసుకోనున్న కమిటీ
  • అన్ని వివరాలు పరిశీలించి క్లాజులవారీగా లోక్‌సభకు రిపోర్ట్ ఇవ్వనున్న జేపీసీ

పార్లమెంట్, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లులను కేంద్ర ప్రభుత్వం నిన్న (మంగళవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన ఈ ప్రతిపాదిత ‘129 సవరణ చట్టం-బిల్లు’, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ బిల్లుల విస్తృత పరిశీలన కోసం ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’కి (జేపీసీ) పంపుతూ లోక్‌సభ నిర్ణయించింది. అయితే, జేపీసీని ఎలా ఏర్పాటు చేస్తారు? ఈ కమిటీ ఏం చేస్తుంది? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. 

పార్లమెంట్‌లో ఉన్న ఎంపీల సంఖ్య ఆధారంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన చట్టసభ్యులను కమిటీలోకి తీసుకుంటారు. రాజ్యసభ సభ్యులు కూడా కమిటీలో ఉంటారు. అత్యధిక సంఖ్యలో ఎంపీలను కలిగివున్న పార్టీకి కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రస్తుతం ఆ అవకాశం బీజేపీకి దక్కనుంది. అంతేకాదు, కమిటీలో ఎక్కువ మంది సభ్యులకు కూడా ఆ పార్టీకి చెందిన వారే ఉండనున్నారు. 

జేపీసీలో గరిష్ఠంగా 31 మంది సభ్యులు ఉండవచ్చు. ఈ కమిటీ కాల వ్యవధి 90 రోజులుగా ఉంటుంది. అవసరమైతే ఆ తర్వాత గడువును పొడిగించేందుకు అవకాశం ఉంటుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మరో 48 గంటల్లోనే జేపీసీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే శుక్రవారంతో (డిసెంబర్ 20) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిపోనున్నాయి. ఈ లోగా కమిటీని ఏర్పాటు చేయకపోతే బిల్లు మురిగిపోతుంది. అలా జరిగితే తదుపరి పార్లమెంట్ సెషన్‌లో బిల్లుని తిరిగి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

జేపీసీ ఏం చేస్తుంది?
కమిటీలో భాగంగా లేని ఎంపీలు, మాజీ జడ్జిలు, లాయర్లు వంటి ఇతర న్యాయ, రాజ్యాంగ నిపుణులతో పాటు సంబంధిత భాగస్వాములతో జేపీసీ సభ్యులు ‘విస్తృత సంప్రదింపులు’ జరుపుతారు. బిల్లు చట్టంగా మారితే ఎన్నికలు నిర్వహించాల్సిన ఎలక్షన్ కమిషన్ మాజీ సభ్యులను కూడా సంప్రదించి అభిప్రాయాలు తీసుకుంటారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను కూడా సంప్రదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సాధారణ జనాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. ఈ సమాచారాన్ని సేకరించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలన చేసి క్లాజులవారీగా లోక్‌సభకు నివేదికను సమర్పించనుంది.

One Nation One Election
Jamili Elections
JPC
Parliament
  • Loading...

More Telugu News