Kolusu Parthasarathy: జోగి రమేశ్ రాక గురించి తెలియదు... టీడీపీ కార్యకర్తలు నన్ను క్షమించాలి: మంత్రి పార్థసారథి

Parthasarathi apology to TDP followers

  • పార్టీ ప్రమేయం, తన ప్రమేయం లేకుండా ఈ పొరపాటు జరిగిందన్న మంత్రి
  • గౌడ సంఘం నేతల్లో వైసీపీ సానుభూతిపరులు ఉండటంతో జోగి వచ్చి ఉంటాడని వెల్లడి
  • ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఆహ్వానపత్రికను పూర్తిగా గమనించలేదన్న మంత్రి
  • చంద్రబాబు, లోకేశ్ తనకు చాలా గౌరవం ఇచ్చారని, దానిని నిలబెట్టుకుంటానన్న మంత్రి
  • వైసీపీ తాను నుండి చించుకొని బయటకు వచ్చిన నన్ను టీడీపీ ఆదరించిందన్న పార్థసారథి
  • టీడీపీ కార్యకర్తలు, నాయకుల కోసమే తాను అహర్నిశలు పని చేస్తున్నానని వ్యాఖ్య
  • భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని వెల్లడి

బలహీనవర్గాల నాయకుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు బాధపడే సంఘటన జరిగిందని, ఈ విషయంలో కార్యకర్తలు తనను క్షమించాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సర్ధార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడం మీద వివిధ పత్రికల్లో రకరకాల కథనాలు వచ్చాయని గుర్తు చేశారు.

చంద్రబాబు, లోకేశ్ తనకు ఇచ్చిన గౌరవాన్ని జీవితంలో మర్చిపోలేనని, తనను ఆదరించిన కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీసినందుకు మరోసారి క్షమాపణ చెబుతున్నానన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను కార్యకర్తలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు.

పార్టీరహితంగా, టీడీపీ మంత్రిగా, నూజివీడులో టీడీపీ అభ్యర్ధిగా... విగ్రహావిష్కరణకు సహాయ సహకారాలు ఉంటాయని, తన అవసరం ఉందనుకుంటే చేస్తానని గౌడ సంఘం సోదరులకు హామీ ఇచ్చానన్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఆహ్వానించే అతిథుల నుంచి... కార్యక్రమ ఏర్పాట్ల వరకు టీడీపీకి గానీ, టీడీపీ జాతీయ అధ్యక్షులు, మండల అధ్యక్షులకు గానీ, ఎలాంటి ప్రమేయం లేదని చెబుతున్నానన్నారు.

ఈ కార్యక్రమాన్ని కేవలం గౌడ సంఘానికి సంబంధించిన వారు మాత్రమే నిర్ణయించారన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఏ తేదీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలో చెప్పాలని గౌడ సంఘ నాయకులు తన వద్దకు చ్చారని, తాను డిసెంబర్ 15వ తేదీని సూచించినట్లు చెప్పారు. ఆ తర్వాత తనకు ఇన్విటేషన్ పంపించినా అది పూర్తిగా చదివే సమయం లేక పూర్తిగా గమనించలేదన్నారు. 15 వ తారీఖు ఐ అండ్ పీఆర్ మీటింగ్ ఉందని విగ్రహావిష్కరణకు రాలేనని కార్యక్రమాన్ని మీరే చేయాలని గౌడ సంఘ నేతలతో చెప్పానన్నారు. 

కానీ తాను రావాలని, తన కోసం ప్రోగ్రాంను మధ్యాహ్నానికి వాయిదా వేస్తామని వారు తనకు చెప్పారని, దీంతో అంగీకరించవలసి వచ్చిందన్నారు. ఐ అండ్ పీఆర్ మీటింగ్ పూర్తిచేసుకుని కార్యక్రమానికి హాజరయ్యనని, అక్కడకు వెళ్లిన తాను 'ఆ వ్యక్తి'ని చూసి షాక్‌కు గురయ్యానన్నారు. అది గౌడ సంఘం కార్యక్రమం కాబట్టి తాను సూచనలు, సలహాలు ఏమీ ఇవ్వకుండా... కార్యకర్తలకు మాత్రం క్షమాపణలు చెబుతున్నానన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు అందరూ టీడీపీ నాయకులేనని వెల్లడించారు.

జోగి రమేశ్‌తో వ్యక్తిగత సంబంధాలు లేవు

తనకు, జోగి రమేశ్‌కు వ్యక్తిగత సంబంధాలేవీ లేవని స్పష్టం చేశారు. గతంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసి తనను ఇబ్బంది పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఇది ఉద్ద్యేశ్యపూర్వకంగా జరిగిందని కాదని కార్యకర్తలకు మరోసారి చెబుతున్నానన్నారు. అక్కడ జరిగిన ర్యాలీలో కూడా టీడీపీ కోసం కష్టపడిన వారు, తన విజయం కోసం సహరించిన వారే ఉన్నారని తెలిపారు. అక్కడ ఎలాంటి గొడవ జరిగినా పార్టీకి కార్యకర్తలకు చెడ్డపేరు వస్తుందని భావించి తాను ఏమీ మాట్లాడలేకపోయినట్లు చెప్పారు.

చంద్రబాబు, లోకేశ్ తనను నమ్మి తనకు గౌరవ ప్రధమైన హోదాను తనకు ఇచ్చారని, తాను ఎప్పుడూ పార్టీ కోసం, కార్యకర్తల బలాన్ని పెంచడం కోసం, కార్యకర్తల అవసరాలని తీర్చే విధంగా పోరాటం చేస్తానన్నారు. పత్రికల్లో వచ్చిన అవాస్తవాలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 

ఆ తానులో నుంచి నన్ను నేను చీల్చుకుని టీడీపీలోకి వచ్చానని అందరికీ మరోసారి చెబుతున్నానన్నారు. రెండు రోజులుగా పత్రికల్లో వచ్చిన వార్తలను చూస్తే తాను వైసీపీని విమర్శించిన అంశాలు కూడా కనిపిస్తాయన్నారు. నేను వైసీపీకి అనుకూలంగా ఉన్నాననేది పచ్చి అబద్ధమన్నారు. ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదన్నారు.

తాను ఎన్నికలకు ఐదారు నెలల ముందు టీడీపీలో చేరినప్పటికీ పార్టీ కార్యకర్తలు తనను నమ్మి, ఆదరించి నూజివీడులో గెలిపించారన్నారు. తన వ్యవహార శైలి, పనితనం గమనించాలని, తాను ఎప్పుడూ కార్యకర్తల బలోపేతం కోసమే చూశానన్నారు. గ్రామాల్లో టీడీపీకి మేలు జరిగేలా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నానన్నారు.

ఇటీవల జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో కూడా వైసీపీ కార్యకర్తలకు తాను మద్దతిస్తున్నాననే ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ ఎన్నికల కోసం తాను ఎవరి పేర్లనూ సూచించలేదని, కానీ 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చేలా చూడాలని మాత్రం సూచించానన్నారు. డీసీ ఎన్నికల్లోనూ తాను ఎక్కడా జోక్యం చేసుకోలేదన్నారు. నాయకత్వానికే ఆ బాధ్యతను అప్పజెప్పి, వారికి సహకరిస్తానన్నారు. తాను వైసీపీ, కాంగ్రెస్‌లో ఉండి వచ్చానని.. ఆ సమయంలో తాను సామాన్యులకు దగ్గరగా ఉండేవాడినన్నారు. ఆ పరిచయాలతో వారిని కూడా టీడీపీలోకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నం చేస్తున్నానన్నారు. వైసీపీలో ఉన్న కార్యకర్తలు తన వద్దకు వస్తే టీడీపీలో చేరితేనే తన వద్దకు రావాలని చెబుతున్నట్లు వెల్లడించారు. రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు, లోకేశ్ తనకు గౌరవం ఇచ్చారని, దానిని నిలబెట్టుకుంటానన్నారు. మున్ముందు కార్యకర్తల మనోభావాలు గాయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు తెలిపారు. నేను ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమం చేశానని వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని ఖండిస్తున్నట్లు చెప్పారు.

వైసీపీ సోషల్ మీడియాకు ఇలాంటి అబద్ధాలను ట్రోల్ చేయడం అలవాటే అన్నారు. అసలు జోగి రమేశ్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం మంచిది కాదని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానన్నారు. సర్ధార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం తన ఆధ్వర్యంలో లేదా గౌతు శిరీష ఆధ్వర్యంలో చేసి ఉంటే తాము తగు జాగ్రత్తలు తీసుకునే వాళ్లమన్నారు.

గౌడ కులానికి చెందిన పెద్దలు ఈ కార్యక్రమం చేయడం, ఆ కార్యక్రమంలో తామూ పాల్గొనడం వల్ల తమపై ఆరోపణలు వచ్చాయన్నారు. పార్టీ కార్యకర్తల్లో కూడా ఓ చెడు ఉద్దేశం వెళ్లిందన్నారు. తనకు సర్ధార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహావిష్కరణకు సంబంధించి వచ్చిన ఆహ్వాన పత్రికను తాను పూర్తిగా గమనించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు.

జోగి రమేష్‌ను ఎవరు ఆహ్వానించారో కూడా తనకు తెలియదని... నిర్వాహకులు కూడా జోగి రమేష్‌ను ఆహ్వానించలేదని తనకు తెలిసిందన్నారు. గౌడ సంఘం నేతల్లో వైసీపీ సానుభూతిపరులు ఉండడంతో ఈ పొరపాటు జరిగిందని తాము భావిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానని పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News