Rohit Sharma: కెప్టెన్ రోహిత్ మళ్లీ విఫలం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
- బ్రిస్బేన్‌లో కేవలం 10 పరుగులకే ఔట్
- క్రీజులో కాసేపు కూడా నిలవలేకపోయిన కెప్టెన్
- ఆసీస్ పేస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు
- వరుసగా విఫలమవడాన్ని సొషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా నిరాశపరిచాడు. 27 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ కేవలం 10 పరుగులకే ఔట్ అయ్యాడు. టీమిండియా కష్టాల్లో ఉండడంతో ఈ మ్యాచ్‌లోనైనా రాణిస్తాడేమోనని ఆశించినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు.
6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ క్రీజులో ఆపసోపాలు పడుతూ బ్యాటింగ్ చేశాడు. ఆస్ట్రేలియా పేసర్ల స్వింగ్ బంతులను ఎదుర్కొనేందుకు తెగ ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
వరుసగా విఫలమవుతున్న రోహిత్ శర్మపై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్రిస్బేన్ టెస్టులో ఔటైన తర్వాత అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన మీమ్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా ఇంత పేలవమైన ప్రదర్శనలు చేయడంపై ఫ్యాన్స్ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంతకుముందు జరిగిన రెండవ టెస్టులో కూడా రోహిత్ వర్మ విఫలమైన విషయం తెలిసిందే.
మొత్తంగా రోహిత్ శర్మ గత 13 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఎనిమిది సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔట్ అయ్యాడు. 11.69 సగటుతో 152 పరుగులు మాత్రమే సాధించగా అందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. మరోవైపు, గబ్బా టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా నిరాశపరిచారు. కేఎల్ రాహుల్ మాత్రమే 84 పరుగులు చేసి కాస్త ఫర్వాలేదనిపించాడు.