Anil Kumble: ఆ వ్యాఖ్యలు, ఆ ఖాతాలతో నాకు సంబంధం లేదు: అనిల్ కుంబ్లే
- కొంతమంది తన ఫొటో ఉపయోగించి నకిలీ వార్తలు రాయడాన్ని ఖండించిన కుంబ్లే
- రోహిత్ కెప్టెన్సీ, బ్యాటింగ్‌లో కోహ్లీ వైఫల్యంపై కుంబ్లే తీవ్ర విమర్శలు చేశాడనేది ఆ వార్తల సారాంశం
- వాటితో తనకేలాంటి సంబంధం లేదని 'ఎక్స్' వేదికగా క్లారిటీ ఇచ్చిన మాజీ కెప్టెన్
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో భారత ఆటగాళ్ల ప్రదర్శన విషయమై తన పేరు, ఫొటోతో సోషల్ మీడియా కథనాలు రావడంపై భారత మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే స్పందించారు. కొంతమంది తన ఫొటో ఉపయోగించి తమకు తోచిన విధంగా వార్తలు రాయడాన్ని మాజీ క్రికెటర్ ఖండించారు. ఆ వార్తల్లోని వ్యాఖ్యలు, ఆ ఖాతాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కుంబ్లే 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు.
ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆటగాళ్ల ప్రదర్శనను తప్పుబడుతూ అనిల్ కుంబ్లే వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది ఆయన ఫొటోను ఉపయోగించి నెట్టింట నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారు. కెప్టెన్సీలో రోహిత్ శర్మ వైఫల్యం, బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలం కావడంపై కుంబ్లే తీవ్ర విమర్శలు చేశాడనేది ఆ వార్తల సారాంశం. దాంతో అవన్నీ నకిలీ వార్తలని, వాటితో తనకేలాంటి సంబంధం లేదని తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు కుంబ్లే ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు.
"కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నా ఫొటోను ఉపయోగించి తప్పుడు వ్యాఖ్యలను నాకు ఆపాదిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఆ ఖాతాలు, అందులోని వ్యాఖ్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సామాజిక మాధ్యమాల్లో చూసే ప్రతిదాన్ని నమ్మవద్దు. ఏదైనా సమాచారాన్ని పంచుకునే ముందు అది సరైనదో.. కాదో ధ్రువీకరించుకోండి. నా అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఇలాంటి వాటి విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా" అని కుంబ్లే ట్వీట్ చేశాడు.