Amaravati: 103 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ నిర్మాణం: మంత్రి నారాయణ

Minister Narayana told media 43rd CRDA meeting details

  • సీఎం చంద్రబాబు నేతృత్వంలో 43వ సీఆర్డీఏ సమావేశం
  • రాజధాని నిర్మాణాలకు సీఆర్డీఏ ఆమోదం
  • రాజధాని నిర్మాణానికి రూ.62 వేల కోట్లు ఖర్చవుతుందన్న మంత్రి నారాయణ

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ సాయంత్రం 43వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఆర్డీఏ సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు. 

రాజధాని నిర్మాణాలకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఏపీ అసెంబ్లీని 103 ఎకరాల్లో భారీ స్థాయిలో నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు..  అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి, టవర్ పై నుంచి అమరావతి నగరం మొత్తం చూసేలా డిజైన్ చేస్తున్నామని చెప్పారు. 

రూ.24,276 కోట్లతో  ట్రంక్ రోడ్లు, లే అవుట్లు, ఐకానిక్ బిల్డింగ్ లు నిర్మించనున్నామని వివరించారు. 151 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్ల నిర్మాణానికి అథారిటీ నుంచి అనుమతి లభించిందని వెల్లడించారు. 

42.3 ఎకరాల్లో హైకోర్టు నిర్మిస్తున్నామని, 55 మీటర్ల ఎత్తుతో హైకోర్టు నిర్మాణం ఉంటుందని, హైకోర్టు నిర్మాణం కోసం రూ.1,048 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. 

17,03,433 చదరపు అడుగుల్లో బేస్ మెంట్, టెర్రస్ లతో కూడిన 47 టవర్ బిల్డింగ్ లు నిర్మిస్తున్నామని... ఈ టవర్లకు అయ్యే ఖర్చు 4,608 కోట్లు అని వివరించారు. ఈ నెలాఖరుకు దాదాపుగా అన్ని టెండర్లు ఖరారవుతాయని, జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. 

మొత్తం రాజధాని నిర్మాణానికి రూ.62 వేల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. వైసీపీకి బురద చల్లడం తప్ప ఇంకేమీ చేతకాదని, ఈ ధరలు ఖరారు చేసింది సీఆర్డీఏ కాదని, గ్రూప్ ఆఫ్ సీఈలు కూర్చుని రేట్లు ఫైనలైజ్ చేస్తారని నారాయణ స్పష్టం చేశారు.

Amaravati
CRDA
P Narayana
AP Capital
TDP-JanaSena-BJP Alliance
  • Loading...

More Telugu News