former mla madhusudan reddy: మున్సిపల్ సిబ్బందిపై దుర్భాషలు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
- స్వర్ణముఖి నది కరకట్టపై అక్రమ నిర్మాణాలు తొలగించే పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులు
- మున్సిపల్ సిబ్బందిని అడ్డుకుని దుర్భాషలాడిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- మాజీ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి శారద
వైసీపీ నేత, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదైంది. శనివారం స్వర్ణముఖి నది కరకట్టపై అక్రమ నిర్మాణాలు తొలగించే పనులను అధికారులు చేపట్టారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎలా నిర్మాణాలు తొలగిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బూతు పదజాలంతో అధికారులపై ఆయన విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే విధి నిర్వహణలో తమపై మాజీ ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి అసభ్య పదజాలంతో దూషించారంటూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి శారద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.