Tirumala: తిరుమలలో జనవరి 14 వరకు సుప్రభాత సేవల రద్దు.. కారణం ఇదే!
- ఈ ఉదయం 6.57 గంటలకు ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు
- ధరుర్మాసం నేపథ్యంలో సుప్రభాత సేవల రద్దు
- తిరుప్పావైతో శ్రీవారి మేల్కొలుపు సేవలు
- జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
- ఈరోజు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ
రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారి మాసోత్సవాల్లో ధనుర్మాసాన్ని అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ధనుర్మాస ఘడియలు ఈ ఉదయం 6.57 గంటలకు ప్రారంభమయ్యాయి. ధనుర్మాసం నేపథ్యంలో సుప్రభాత సేవలను రద్దు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. తిరుప్పావైతో నెల రోజుల పాటు శ్రీవారి మేల్కొలుపు ఉంటుంది. దీంతోపాటు, ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు.
మరోవైపు జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు అవకాశం కల్పించనున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్ లో 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు ఉన్నారు. నిన్న అర్ధరాత్రి వరకు 66,160 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22,724 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.47 కోట్లను భక్తులు సమర్పించారని టీటీడీ వెల్లడించింది.