Bigg Boss-8: బిగ్ బాస్-8 గ్రాండ్ ఫినాలే: నాగార్జున ఆఫర్ ను తిరస్కరించిన ఇద్దరు ఫైనలిస్టులు... స్టేజ్ పైకి వచ్చిన రామ్ చరణ్
బిగ్ బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు కంటెస్టెంటలో ఆఖరి రౌండ్ కు గౌతమ్, నిఖిల్ మాత్రమే మిగిలారు. వారిద్దరినీ డబ్బులతో టెంప్ట్ చేసేందుకు హోస్ట్ నాగార్జున ప్రయత్నించారు. నాగ్ ఓ బ్రీఫ్ కేసుతో హౌస్ లోకి ఎంటరై... మీలో ఎవరైనా బ్రీఫ్ కేసు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. అయితే, గౌతమ్, నిఖిల్ ఇద్దరూ కూడా డబ్బు కంటే విజయమే ముఖ్యమని స్పష్టం చేశారు. దాంతో, నాగ్ వారిద్దరినీ గార్డెన్ ఏరియా మీదుగా స్టేజ్ పైకి తీసుకువచ్చారు.
అంతకుముందు... టాప్-5 ఫైనలిస్టుల్లో అవినాశ్, ప్రేరణ, నభీల్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. అవినాశ్ ను కన్నడ హీరో ఉపేంద్ర హౌస్ నుంచి బయటికి తీసుకురాగా... ప్రేరణను ప్రగ్యా జైస్వాల్... నభీల్ ను విజయ్ సేతుపతి-మంజు వారియర్ జోడీ హౌస్ నుంచి బయటికి తీసుకువచ్చారు. ఇక, టైటిల్ పోరాటం నిఖిల్, గౌతమ్ మధ్యే మిగిలుంది.
కాగా, విన్నర్ ను డిసైడ్ చేసే ఫైనల్ మూమెంట్స్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రావడం విశేషం. అయ్యప్ప మాల ధారణలో ఉన్న రామ్ చరణ్... బిగ్ బాస్ కంటెస్టెంట్ల పెర్ఫారెన్స్ ను ఆస్వాదించారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ తన కొత్త చిత్రం గేమ్ చేంజర్ గురించి చెప్పారు. దర్శకుడు శంకర్ నుంచి కాల్ రాగానే వెంటనే ఓకే చెప్పానని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్న సమయంలో గేమ్ చేంజర్ ఆఫర్ వచ్చిందని, ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉంటుందని తాను అనుకోవడంలేదని అభిప్రాయపడ్డారు.