One Nation One Election: వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లులపై సందిగ్ధత... రేపటి లిస్టు నుంచి తొలగింపు!
- సోమవారం లోక్‌సభ బిజినెస్ అజెండాలో కనిపించని బిల్లులు
- మోదీ సర్కారు ఊహించని నిర్ణయం
- ప్రస్తుత సమావేశాలకు మరో నాలుగు రోజులే సమయం
ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభలో సోమవారం (డిసెంబర్ 16) ఈ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా వెనక్కి తగ్గింది. లోక్‌సభ సోమవారం బిజినెస్ అజెండా నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులను తొలగించింది. ఈ మేరకు అప్‌డేట్ చేసిన లిస్టులో ఈ బిల్లులు కనిపించడం లేదు. దీంతో ఈ బిల్లులు చట్టసభల ముందుకు రావడంపై సందిగ్ధత నెలకొంది.
కాగా, ఈ బిల్లులను కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ సోమవారం సభలో ప్రవేశపెడతారని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఆ మేరకు లిస్టులో కూడా చేర్చింది. అవగాహన కోసం ఎంపీలకు బిల్లుల కాపీలను సైతం పంపిణీ చేసింది. అంతలోనే ఈ పరిణామం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ బిల్లులను తిరిగి ఎప్పుడు సభలో ప్రవేశపెడతారనే విషయంపై కూడా ఎలాంటి సమాచారం లేదు. డిసెంబర్ 20తో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. సోమవారాన్ని మినహాయిస్తే మరో నాలుగు రోజులే మిగిలి ఉంటాయి. మరి ఈ సెషన్‌లోనే సభ ముందుకు బిల్లులను తీసుకొస్తారా... లేదా? అనేది తెలియాల్సి ఉంది.