Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
- ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 70 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న విరాట్
- ఆసీస్‌పై అత్యధిక క్యాచ్‌లు అందుకున్న నాన్-వికెట్ కీపర్‌గా రికార్డు
- గబ్బా టెస్టు మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకున్న కోహ్లీ
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సామర్థ్యం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఫీల్డింగ్‌లో కూడా అతడు అద్భుతమైన ఆటగాడే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, బ్యాటింగ్ ప్రదర్శనల కారణంగా కోహ్లీ ఫీల్డింగ్ నైపుణ్యాల గురించి పెద్దగా మాట్లాడుకోరు. కోహ్లీ ఫీల్డింగ్‌కు సంబంధించిన వార్తలు చాలా అరుదుగా వస్తుంటాయి. బ్రిస్టేన్‌లోని గబ్బా మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ రెండు అదిరిపోయే క్యాచ్‌లు అందుకున్నాడు.
స్లిప్స్‌లో ఆసీస్ బ్యాటర్లు నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్ క్యాచ్‌లను ఒడిసిపట్టాడు. వీటితో ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ మొత్తం 70 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. దీంతో విరాట్ ఖాతాలో ఒక రికార్డు చేరింది. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక క్యాచ్‌లు అందుకున్న నాన్-వికెట్ కీపర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
ఒక జట్టుపై అత్యధిక క్యాచ్‌లు అందుకున్న నాన్-వికెట్ కీపర్లు
1. ఇంగ్లండ్‌పై స్టీవ్ స్మిత్ - 76
2. ఇంగ్లండ్‌పై మహేల జయవర్దనే - 72
3. ఇంగ్లండ్‌పై అలెన్ బోర్డర్ - 71
4. ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ - 70
5. వెస్టిండీస్‌పై మార్క్ వా - 68
6. ఇంగ్లండ్‌పై గ్రెగ్ చాపెల్ - 67
7. భారత్‌పై వివ్ రిచర్డ్స్ - 65
8. న్యూజిలాండ్‌పై అలెన్ బోర్డర్ - 64
9. ఆస్ట్రేలియాపై రాహుల్ ద్రావిడ్ - 63
కాగా, విరాట్ కోహ్లీ మరో ఏడు క్యాచ్‌లు అందుకుంటే ఈ జాబితాలో అగ్ర స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అగ్రస్థానంలో ఉన్న ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్‌పై మొత్తం 76 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న మహేల జయవర్ధనే, అలెన్ బోర్డర్‌ను అధిగమించడానికి కోహ్లీ మరో రెండు క్యాచ్‌లు అందుకుంటే సరిపోతుంది.