Vajedu SI Harish: వాజేడు ఎస్సై ఆత్మహత్య కేసు.. ట్రాప్ చేసిన యువతి అరెస్ట్
- సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఈ నెల 2న ఎస్సై హరీశ్ ఆత్మహత్య
- రాంగ్‌కాల్ ద్వారా హరీశ్‌కు పరిచయమైన యువతి అనూష
- తనను పెళ్లి చేసుకోవాలంటూ ఎస్సైపై ఒత్తిడి
- ఆయన నిరాకరించడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపు
- మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిన హరీశ్
ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసులో పోలీసులు నిన్న నిందితురాలైన యువతిని అరెస్ట్ చేశారు. హరీశ్ బలవన్మరణానికి ఆమె వేధింపులే కారణమని నిర్ధారించిన పోలీసులు కొన్ని రోజులుగా ఆమె కోసం గాలిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చచ్చిపోవాలంటూ ఆమె చేసిన వేధింపులే ఎస్సై ఆత్మహత్యకు కారణంగా పోలీసులు తేల్చారు.
హరీశ్ ఈ నెల 2న వాజేడు మండలం ముల్లెకట్ట వారధి సమీపంలోని ఓ రిసార్టులో తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియతండాకు చెందిన బానోతు అనసూర్య అలియాస్ అనూష ఓ కాలేజీలో స్టాఫ్ అడ్మిన్‌గా పనిచేస్తోంది.
ఈ క్రమంలో ఏడు నెలల క్రితం ఓ రాంగ్‌కాల్ ద్వారా ఎస్సై పరిచయమయ్యారు. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. ఆయనను పెళ్లి చేసుకుంటే జీవితంలో స్థిరపడవచ్చని భావించి హరీశ్‌కు తరచూ ఫోన్ చేస్తూ మరింత దగ్గరైంది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే, అందుకు ఆయన నిరాకరించడంతో తనను శారీరకంగా ఉపయోగించుకుని, ఇప్పుడు పెళ్లికి తిరస్కరిస్తున్నావని ఉన్నతాధికారులకు, మీడియాకు చెబుతానంటూ బెదిరించింది. తనను పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోవాలంటూ ఇబ్బందులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన హరీశ్ ఆత్మహత్య చేసుకున్నారు. అనూషను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.