NTR Diamond Jubilee celebrations: ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలో సినీ పాత్రికేయులకు విశిష్ట సత్కారం
- ఎన్టీఆర్ సినీ జీవితానికి 75 ఏళ్లు
- పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక
- ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
- సీనియర్ సినీ జర్నలిస్టులకు మెమెంటోల బహూకరణ
కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమంలో సీనియర్ సినీ పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. ఎన్టీఆర్ డైమండ్ జూబ్లీ పేరిట ప్రత్యేకంగా తయారుచేయించిన జ్ఞాపికలను ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ సినీ జర్నలిస్టులకు బహూకరించారు. మోహన్ గోటేటి, బీకే ఈశ్వర్, కె.ఉడయవర్లు, కె.ఉమామహేశ్వరరావు, గౌస్, శాతవాహన, యు.వినాయకరావు, రెంటాల జయదేవ, అనురాధ, రమణమూర్తి తదితర పాత్రికేయులు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మెమెంటోలు అందుకున్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీఎం చంద్రబాబు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ స్పెషల్ క్యాలెండర్ ను కూడా ఆవిష్కరించారు.
దాంతోపాటే, తారకరామం-అన్న గారి అంతరంగం పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఎన్టీఆర్ సినిమా కెరీర్ విశేషాలు, పలు ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు, ఆయన గురించి సమాచారాన్ని, ఆయన గురించి ఇతర ప్రముఖులు చెప్పిన మాటలను పొందుపరిచారు.