K Kavitha: ఉద్యమ సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తాం: కవిత
- చేతిలో జొన్నకర్ర, మరో చేతిలో బతుకమ్మ ఉండాలన్న కవిత
- ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు కొనసాగిస్తామని వెల్లడి
- రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లిపై ప్రేమ లేదని మండిపాటు
తాము ఉద్యమ సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఒక చేతిలో జొన్నకర్ర, మరో చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవాన్ని చాటేలా పద్యాలు, కవితలు రచించి పుస్తకాలుగా విడుదల చేస్తామన్నారు. ఉద్యమ సమయం తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా ఏర్పాటు చేసుకుంటూ వెళతామన్నారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లిపై ప్రేమ లేదని, అందుకే విగ్రహం రూపాన్ని మార్చారని ఆరోపించారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుంటే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సుహృద్భావం ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు.
బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని... జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.