Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. డే లైట్ సేవింగ్ టైమ్ కు స్వస్తి?
- అమెరికన్లపై చాలా భారం పడుతోందన్న ట్రంప్
- ఉపయోగం కన్నా అసౌకర్యమే ఎక్కువని వ్యాఖ్య
- ఏటా రెండుసార్లు టైమ్ ను సరిచేసుకుంటున్న అమెరికన్లు
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యంగా మారిన డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. డే లైట్ సేవింగ్ టైమ్ వల్ల అమెరికన్లపై చాలా భారం పడుతోందని ఆరోపించారు. రిపబ్లికన్ ప్రభుత్వం ఇలాంటి వాటిని సరిచేసి ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలన అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఈ నిర్ణయం అమలు చేయడానికి ప్రయత్నిస్తానని వివరించారు. దీంతో ఏటా రెండుసార్లు టైమ్ ను సరిచేసుకునే ఇబ్బంది నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని, దేశంపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ట్రంప్ వివరించారు.
డే లైట్ సేవింగ్ టైమ్ అంటే..
అమెరికా సంయుక్త రాష్ట్రాల విస్తీర్ణం చాలా ఎక్కువనే విషయం తెలిసిందే. యూఎస్ఏలోని కొన్ని ప్రాంతాలు వివిధ టైమ్ జోన్ లలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పగటిపూట సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ‘డే లైట్ సేవింగ్ టైమ్’(డీఎస్ టీ). దీని ప్రకారం.. మార్చిలో పగటి పూట వెలుతురు ఎక్కువగా ఉన్నపుడు గడియారాన్ని ఒక గంట ముందుకు జరుపుతారు. తిరిగి నవంబర్ లో ఒక గంట వెనక్కి జరుపుతారు. దీని ఉద్దేశం పగటి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే. ఏటా మార్చి రెండవ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గడియారాన్ని గంట ముందుకు తిప్పి 3 గంటలు చూపించేలా మార్చుతారు. తిరిగి నవంబర్ మొదటి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గడియారాన్ని 1 గంట చూపించేలా మార్చేస్తారు.