Allu Arjun: జైల్లో అల్లు అర్జున్ ఒక రాత్రి.. గడిచింది ఇలా!

Sources said Allu Arjun prisoner number is 7697 and he slept on the floor of the jail

  • ఖైదీ నంబర్ 7697ను కేటాయించిన జైలు అధికారులు
  • భోజనం ఆఫర్ చేసినా తినని బన్నీ
  • సాధారణ ఖైదీలా నేలపైనే నిద్ర
  • జైలు వర్గాల ద్వారా ఆసక్తికర విషయాలు వెల్లడి 

పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ కావడం, 14 రోజుల రిమాండ్‌పై చంచల్‌గూడ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర బెయిల్ ఆదేశాలు సకాలంలో జైలు అధికారులకు చేరకపోవడంతో బన్నీ శుక్రవారం రాత్రి జైల్లోనే గడపాల్సి వచ్చింది. శనివారం ఉదయం ఆయన విడుదలై ఇంటికి చేరుకున్నారు.

కాగా, చంచల్‌గూడ జైలులో అల్లు అర్జున్‌కు ఖైదీ నంబర్ 7697‌ను జైలు అధికారులు కేటాయించినట్టు సమాచారం. అధికారులు భోజనం అందించినా తినలేదని, సాధారణ ఖైదీల మాదిరిగా రాత్రంతా నేలపై పడుకున్నాడని జైలువర్గాలు చెప్పినట్టు కథనాలు వెలువడుతున్నాయి. మంజీరా బ్లాక్‌లోని ప్రత్యేక బ్యారక్‌ను అల్లు అర్జున్‌కు కేటాయించినట్టు సమాచారం. 

ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి ఇచ్చినట్టు సమాచారం. ఇక ముగ్గురు ఖైదీలు ఉండే బ్యారక్‌ను కేటాయించారని, అందులో మరో ఇద్దరు విచారణ ఖైదీలు ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రంతా నిద్ర పోకుండా అలాగే ఉన్నాడని, ఎప్పుడు విడుదల చేస్తారని మాత్రమే జైలు అధికారులతో అల్లు అర్జున్ మాట్లాడినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉన్నాడని తెలుస్తోంది.

కాగా, హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందినప్పటికీ అల్లు అర్జున్‌ను విడుదల చేయలేదని, దీనిపై జైలు అధికారులు సమాధానం చెప్పాలని ఐకాన్ స్టార్ తరపున వాదించిన అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది అక్రమ నిర్బంధమని, తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News