Suchir Balaji: ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి

OpenAI Whistleblower Suchir Balaji Found Dead

  • ఓపెన్ ఏఐలో గతంలో రీసెర్చ్‌గా పనిచేసిన సుచిర్ బాలాజీ
  • అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఓపెన్ ఏఐ ఉల్లంఘించిందని ఆరోపణ
  • గత నెల 26న శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పద మృతి

చాట్ జీపీటీ సృష్టికర్త, అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఓపెన్ ఏఐ మాజీ రీసెర్చర్, విజిల్ బ్లోయర్ సుచిర్ బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసే సుచిర్ శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్‌లో నవంబర్ 26న విగతజీవిగా కనిపించాడు. ఆ రోజున మధ్యాహ్నం తన ఫ్లాట్‌లో మృతి చెంది కనిపించినట్టు పోలీసులు తెలిపారు. ఆయన మృతికి గల కారణాన్ని మాత్రం వైద్యులు వెల్లడించలేదు. అయితే, ఇప్పటికైతే సుచిర్ మృతి విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు.

మరణానికి మూడు నెలల ముందు సుచిర్ మాట్లాడుతూ చాట్‌జీపీటీ అభివృద్ది విషయంలో ఓపెన్ ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన చాట్‌జీపీటీ.. రచయితలు, ప్రోగ్రామర్లు, జర్నలిస్టుల నుంచి న్యాయపరమైన వివాదాలు ఎదుర్కొంది. ఈ ప్రోగ్రాంను అభివృద్ది చేసే క్రమంలో తమ కాపీరైట్ కంటెంట్‌ను ఉపయోగించుకుందని వీరు ఆరోపించారు. ఈ ఉల్లంఘనల విలువ 150 బిలియన్ డాలర్లు పైనేనని పేర్కొన్నారు.

అక్టోబర్ 23న ‘న్యూయర్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలాజీ మాట్లాడుతూ వ్యాపారాలు, పారిశ్రామికవేత్తలపై ఓపెన్ ఏఐ ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పాడు. ఇంటర్నెట్ ఎకోసిస్టంకు ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని తెలిపాడు. సుచిర్ నాలుగేళ్లపాటు ఓపెన్ ఏఐలో పనిచేశాక ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చాడు.

  • Loading...

More Telugu News