Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్
- హైకోర్టు తీర్పు కాపీలు జైలుకు చేరడంలో ఆలస్యం
- రాత్రంతా జైలులోనే అల్లు అర్జున్
- ఆర్డర్ కాపీలు జైలుకు చేరడంతో ష్యూరిటీ సమర్పించి విడుదలైన నటుడు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయిన ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత కాసేపటికే రూ. 50 వేల పూచీకత్తుతో హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.
అయితే, కోర్టు ఆర్డర్ కాపీ జైలుకు చేరడం ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ రాతంత్రా జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఆర్డర్ కాపీలు రాగానే, అప్పటికే ఆయన న్యాయవాదులు సిద్ధం చేసి ఉంచిన ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. లాంఛనాలన్నీ పూర్తయ్యాక అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, నిన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు.