Allu Arjun: ఒక వీఐపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే.. ఒక కుటుంబం అనాథ అయింది.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కామెంట్స్
- అనాథ అయిన కుటుంబం గురించి ఎవరూ మాట్లాడడం లేదన్న చామల
- శాంతిభద్రతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండవని చురక
- బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శ
- వీఐపీలు ఇకపై జాగ్రత్తగా ఉంటారన్న భువనగిరి ఎంపీ
ఒక వీఐపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో ఒక కుటుంబం అనాథ అయిందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అనాథ అయిన కుటుంబం గురించి ఎవరూ మాట్లాడటం లేదని, అరెస్ట్ నుంచి రాజకీయ లబ్ధి పొందాలని మాత్రమే చూస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇదే పనిలో ఉన్నారని మండిపడ్డారు.
శాంతి భద్రతలు అనేవి తెలంగాణలో ఒకలా, కర్ణాటక, మహారాష్ట్రలో మరోలా ఉండవని చామల పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, వీఐపీల మీద కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పోలీసు వ్యవస్థ, చట్టం చూసుకుంటుందని అన్నారు. ఈ ఘటనతోనైనా వీఐపీలు జాగ్రత్తగా ఉండాలని భావిస్తారని పేర్కొన్నారు.