Allu Arjun: ఆలస్యం కానున్న అల్లు అర్జున్ రిలీజ్

Allu Arjun release likely to take more time

  • సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
  • రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
  • మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు
  • జైలు అధికారులకు ఇంకా అందని కోర్టు ఆర్డర్ కాపీ

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిన కేసులో హీరో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ లభించినప్పటికీ, చంచల్ గూడ జైలు నుంచి విడుదల ఆలస్యం కానుంది. హైకోర్టు తీర్పు ఉత్తర్వులు కాపీ ఇంకా జైలు అధికారులకు అందకపోవడమే అందుకు కారణం. ఆయన న్యాయవాదులు ష్యూరిటీ బాండ్లను సిద్ధం చేసి ఉంచారు. కోర్టు ఆర్డర్ కాపీ కోసం వేచిచూస్తున్నారు. 

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హీరో అల్లు అర్జున్ పై కూడా పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. 

ఈ నేపథ్యంలో, నేడు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు, ఆయనను అరెస్ట్ చేయడం తెలిసిందే. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా... పోలీసులు అల్లు అర్జున్ చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత కాసేపటికే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 

ఈ సాయంత్రమే ఆయన విడుదలవుతాడని భావించినప్పటికీ, అధికారిక ప్రక్రియ పూర్తి కావడానికి మరింత సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ రాత్రికి అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వస్తుందని సమాచారం.

  • Loading...

More Telugu News