Allu Arjun: ఒక నేరస్తుడిలా అరెస్ట్ చేస్తారా?: అల్లు అర్జున్ అరెస్ట్‌పై బండి సంజయ్ స్పందన

Bandi Sanjay Raja Singh on Allu Arjun arrest

  • అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన అల్లు అర్జున్‌కు గౌరవం ఇవ్వాలన్న సంజయ్
  • నేరుగా బెడ్రూంకు వెళ్లి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్న
  • సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్ తప్పులేదన్న రాజాసింగ్

సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అల్లు అర్జున్ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చారని, ఆయనకు గౌరవం ఇవ్వాలని... నేరస్థుడిగా చూడవద్దని బండి సంజయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నేరుగా బెడ్రూంకు వెళ్లి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. దుస్తులు మార్చుకోనివ్వకుండా అరెస్ట్ చేయడమేమిటన్నారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పూర్తి వైఫల్యం ప్రభుత్వానిదేనని ఆరోపించారు. థియేటర్‌లో తొక్కిసలాట కారణంగా మహిళ మృతి దురదృష్టకరమన్నారు. అయితే అక్కడకు వచ్చిన ప్రేక్షకులను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. పుష్ప-1 సినిమా భారీ విజయం తర్వాత పుష్ప-2పై అభిమానులు, సినిమా ప్రియులు భారీ అంచనాలతో ఉన్నారని తెలిపారు.

అయితే థియేటర్‌లో సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. సంధ్య థియేటర్ వద్ద ఇంతటి నిర్లక్ష్యం, నిర్వహణలేమి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. అయితే అల్లు అర్జున్, అతని అభిమానులు గౌరవానికి అర్హులే తప్ప... అక్కడ జరిగిన గందరగోళానికి వారు కారణం కాదని పేర్కొన్నారు. 

అల్లు అర్జున్ తప్పు లేదన్న రాజాసింగ్
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత పోలీసు శాఖదేనని రాజాసింగ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ తప్పేమీ లేదన్నారు. ఆయన తన విజయాలు, అవార్డులతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గౌరవం తీసుకువచ్చారన్నారు. ప్రత్యక్షంగా అతను కారణం కాదని, కానీ అతనిని బాధ్యుడిని చేయడం సరికాదన్నారు.

అక్కడ జరిగిన ఘటనలోని లోపాలను గుర్తించడానికి బదులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం పాలనపై చెడు ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందన్నారు. అల్లు అర్జున్ గౌరవానికి అర్హుడే తప్ప... అతనిని క్రిమినల్‌గా చూడటం సరికాదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News