Allu Arjun: అల్లు అర్జున్ అత్యవసర పిటిషన్... ఉదయం మెన్షన్ చేయాలి కదా అన్న హైకోర్టు
- ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశాం.. అత్యవసరంగా విచారించాలన్న న్యాయవాది
- ఉదయం గం.10.30కే మెన్షన్ చేయాలి కదా అన్న హైకోర్టు
- సోమవారం వరకు చర్యలు తీసుకోకుండా చూడాలని కోరిన న్యాయవాది
- పోలీసుల నుంచి వివరాలు సేకరించాక కోర్టుకు సమాచారమిస్తామన్న ప్రభుత్వ న్యాయవాది
అరెస్ట్ నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశామని, దీనిని అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే మధ్యాహ్నం చెబితే ఎలా అంటూ హైకోర్టు పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. అయితే తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.
ఉదయమే మెన్షన్ చేయాలి కదా అన్న హైకోర్టు
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ కోసం ఆయన న్యాయవాది ప్రయత్నాలు చేశారు. అత్యవసరంగా పిటిషన్‌ను విచారించాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను బుధవారం వేశామని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
అయితే అత్యవసర పిటిషన్ అయితే ఉదయం గం.10.30కే మెన్షన్ చేయాలి కదా అని కోర్టు... అల్లు అర్జున్ న్యాయవాదిని ప్రశ్నించింది. క్వాష్ పిటిషన్ అంశాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్ కోరారు. మధ్యాహ్నం గం.1.30 సమయానికి లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కోరడం సరికాదని పీపీ తెలిపారు.
సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని విజ్ఞప్తి
సోమవారం వరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. అయితే పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు వివరాలు సమర్పిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలక వాయిదా వేశారు.
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశాం: సీపీ సీవీ ఆనంద్
కాగా, అల్లు అర్జున్ అరెస్ట్ ను పోలీసులు నిర్దారించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిన్నట్టు లా అండ్ ఆర్డర్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం అతనిని కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.