Lanka T10 League: శ్రీలంక టీ10 లీగ్ ప్రారంభ ఎడిషన్‌లోనే ఫిక్సింగ్ కలకలం... ఇండియన్ టీం యజమాని అరెస్ట్
- శ్రీలంకలో టీ10 లీగ్ ప్రారంభ ఎడిషన్
- తలపడుతున్న ఆరు జట్లు
- ‘గాలె మార్వెల్స్’ జట్టు యజమాని ప్రేమ్ ఠాకూర్ అరెస్ట్
- పల్లెకెలెలో జరిగిన మ్యాచ్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు
- ఫిక్సింగ్ చేయాలన్న ప్రేమ్ అభ్యర్థనను తిరస్కరించి ఫిర్యాదు చేసిన విండీస్ ఆటగాడు
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై లంక టీ10 లీగ్‌లో ఓ జట్టుకు యజమాని అయిన భారతీయుడిని శ్రీలంక స్పోర్ట్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. టీ10 లీగ్ ప్రారంభ ఎడిషన్‌లోనే ఫిక్సింగ్ ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.
శ్రీలంకలో జరుగుతున్న టీ10 లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడుతున్నాయి. వీటిలో ‘గాలె మార్వెల్స్’ జట్టుకు ప్రేమ్ ఠాకూర్ యజమానిగా ఉన్నారు. పల్లెకెలెలో జరిగిన మ్యాచ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
మ్యాచ్‌ను ఫిక్స్ చేయాలని ఠాకూర్ తనను కోరారని, అందుకు తాను నిరాకరించినట్టు విండీస్ ఆటగాడు తెలిపాడు. అతడి ఫిర్యాదు మేరకే పోలీసులు ఠాకూర్‌ను అరెస్ట్ చేశారు. ఫిక్సింగ్ ఆరోపణలపై అధికారులు విచారణకు ఆదేశించారు.