Allu Arjun: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్

Actor Allu Arjun arrest

  • 'పుష్ప-2' బెనిఫిట్ షోకు వెళ్లిన అల్లు అర్జున్
  • తొక్కిసలాటలో ఒక మహిళ మృతి
  • బన్నీని అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు

సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'పుష్ప-2' సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ కు బన్నీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై కేసు నమోదయింది. ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 20 మంది పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు.

హైదరాబాద్ లోని నివాసం నుంచి ఆయనను పోలీసులు తమ వాహనంలో పీఎస్ కు తీసుకెళ్లారు. నవ్వుతూ అల్లు అర్జున్ పోలీసుల వాహనంలోకి ఎక్కారు. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య లేదా ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.

మరోవైపు, కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో బన్నీకి ఇంకా ఊరట లభించలేదు. న్యాయస్థానం ఇంకా తీర్పును వెలువరించలేదు. ఇదే ఘటనలో సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేశారు. బన్నీని పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. బన్నీ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది.

Allu Arjun
Arrest
Tollywood
  • Loading...

More Telugu News