gukesh: ఏం చేద్దామా? అని ఎంతోమంది ఆలోచించే 18 ఏళ్లకే గుకేశ్ రికార్డ్: రేవంత్, కేటీఆర్ అభినందనలు

CM Revanth Reddy congratulates Gukesh

  • 18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచారంటూ సీఎం అభినందనలు
  • గుకేశ్ విజయంతో దేశం గర్విస్తోందన్న కిషన్ రెడ్డి
  • ఔత్సాహిక ప్రతిభావంతులకు గుకేశ్ స్ఫూర్తి అన్న బండి సంజయ్

18 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారని తెలంగాణ సీఎంవో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. 18 ఏళ్ల వయస్సులో ఏం చేయాలని చాలామంది ఆలోచిస్తుంటారని, అలాంటి వయస్సులో గుకేశ్ రికార్డ్ సృష్టించారని కేటీఆర్ పేర్కొన్నారు.

అత్యంత పిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేశ్ నిలిచారని, ఇది చారిత్రాత్మక, ఎంతోమందికి ప్రేరణను ఇచ్చే విజయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విజయం అతని అసమాన ప్రతిభకు, నిరంతర కృషికి, అచంచలమైన సంకల్పానికి నిదర్శనమన్నారు.

చెస్ రంగంలో గుకేశ్ తన విజయాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు పెద్ద పెద్ద కలలు కనే యువతకు ప్రేరణగా నిలుస్తాడన్నారు. అంకితభావం, అభిరుచితో ఏదైనా సాధించవచ్చని గుకేశ్ తన విజయం ద్వారా వెల్లడించారన్నారు. గుకేశ్ ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మరెన్నో విజయాలు సాధించాలి: కిషన్ రెడ్డి

2024 ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచినందుకు గుకేశ్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గుకేశ్ విజయంతో యావత్ దేశం గర్విస్తోందన్నారు. గుకేశ్ ఈ రంగంలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఔత్సాహిక ప్రతిభావంతులకు స్ఫూర్తి: బండి సంజయ్

గుకేశ్ విజయం ఈ దేశానికి కూడా గొప్ప మైలురాయి అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఔత్సాహిక ప్రతిభావంతులకు గుకేశ్ స్ఫూర్తిగా నిలిచారన్నారు.

చిన్న వయస్సులో రికార్డ్ సృష్టించారు: కేటీఆర్

మనలో చాలామంది 18 ఏళ్ల వయస్సులో ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటారని, కానీ అదే వయస్సులో మీరు అద్భుతమైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గెలిచిన గుకేశ్‌కు అభినందనలు తెలిపారు. ఇది ఆయన కుటుంబానికే కాకుండా ఈ దేశానికే గర్వించదగ్గ క్షణాలు అన్నారు. గుకేశ్ ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News