KTR: కోతలు, కూతలు కాదు.. చేతలు కావాలి: కేటీఆర్‌

BRS Working President KTR Criticizes Congress Government

  • సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్ర‌క‌ట‌న‌
  • ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలన్న కేటీఆర్‌
  • ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని కేటీఆర్ ఫైర్
  • పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకొద్దని కేటీఆర్ హితవు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్.. సంక్రాంతికి రైతు భరోసా అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా స్పందించారు. ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలన్నారు. కోతలు, కూతలు కాదు.. చేతలు కావాలంటూ చురకలంటించారు. 

అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని ఊదరగొట్టారు. కానీ ఏడాదిగా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అర్హుల కోసం, అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘం అని సభలు, సమావేశాలు పెట్టారని విమ‌ర్శించారు. ఏడాదిగా రైతుబంధు మీద కొండను తవ్వి ఎలుకను పట్టలేదు.. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఊసేలేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారం కోసం అబద్దాలు .. అధికారం దక్కిన తర్వాత పథకాల ఎగవేతకు కుంటిసాకులు చెబుతున్నారంటూ దుయ్య‌బ‌ట్టారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసంతో మీసం మెలేసిన రైతన్నలను ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అప్పుల పాలు చేశార‌ని మాజీ మంత్రి మండిప‌డ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. 

వర్షం కురుస్తుందో ? లేదో ?... సాగునీరు అందుతుందో ? లేదో ?... కరెంటు వస్తుందో ? లేదో ?... పెట్టిన పెట్టుబడికి తగిన దిగుబడి వస్తుందో ? లేదో ? తెలియకున్నా భూమిని నమ్మి సేద్యం చేసి, ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలకు భరోసా ఇవ్వాల‌ని కోరారు. అమ్మల విషయంలో, అన్నదాతల విషయంలో వివక్ష చూప‌రాద‌ని, పథకాల అమలు ఎగవేతకు కారణాలు వెతకొద్దని కేటీఆర్ హితవు ప‌లికారు.

  • Loading...

More Telugu News