Avanthi Srinivas: వైసీపీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా.. తప్పు తెలుసుకోవాలంటూ జగన్ కు సూచన!

Avanthi Srinivas fires on Jagan after resigning to YSRCP

  • జగన్ కు రాజీనామా లేఖను పంపిన అవంతి శ్రీనివాస్
  • ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని జగన్ కు హితవు
  • వైసీపీలో కార్యకర్తలు నలిగిపోయారని ఆవేదన

వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్, ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా మీడియాతో అవంతి మాట్లాడుతూ... పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే... ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది సమయం ఇవ్వాలని చెప్పారు. ఐదు నెలల సమయం కూడా ఇవ్వకుండానే ధర్నాలు చేయాలంటే ఎలాగని ప్రశ్నించారు. 
 
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలని అవంతి అన్నారు. ఐదేళ్లు పాలించాలని కూటమికి ప్రజలు అవకాశం ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఎన్నో పథకాలను అమలు చేసి కూడా... ఎన్నికల్లో ఓడిపోయామంటే... తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని చెప్పారు. పార్టీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని అన్నారు. వైసీపీ పాలనలో పార్టీ కార్యకర్తలంతా నలిగిపోయారని చెప్పారు. తాడేపల్లిలో కూర్చొని జగన్ ఆదేశాలు ఇస్తుంటారని... క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడేది కార్యకర్తలని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో కార్యకర్తలకు గౌరవం లేదని విమర్శించారు.

చిరంజీవిపై ఉన్న అభిమానంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని... నిజయతీగా ప్రజలకు సేవ చేశానని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన కుటుంబానికి సమయం ఇవ్వాలనుకుంటున్నానని, తమ విద్యాసంస్థలను కూడా చూసుకోవాల్సి ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News