Mohan Babu: సినీ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు!
- మీడియా ప్రతినిధులపై దాడి ఘటన
- మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు
- ఈ ఘటనలో ఇప్పటికే ఆయనపై 118(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు
- లీగల్ ఒపీనియన్ తర్వాత 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు
మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో సినీ నటుడు మంచు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు తాజాగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆయనపై 118(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు.. 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఇక మంచు ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంచు మనోజ్ ఇంటి గేట్లను తన్నుకుంటూ లోపలికి వెళ్లడంతో మీడియా ప్రతినిధులు కూడా నివాసం లోపలికి వెళ్లడం జరిగింది. అదే సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధి చేతిలో నుంచి మైకు లాక్కుని ముఖంపై దాడి చేశారు.
దాంతో మీడియా ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు కూడా బౌన్సర్లు మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇలా మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలోనే కేసు నమోదైంది.