Rohit Sharma: టెస్టు ర్యాంకింగ్స్ లో మరింత దిగజారిన హిట్ మ్యాన్
- టెస్టుల్లో బ్యాటింగ్ ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ
- 31వ స్థానానికి పడిపోయిన రోహిత్ శర్మ
- ఏకంగా ఆరు స్థానాలు పతనం
- ఇటీవల తరచుగా విఫలమవుతున్న టీమిండియా కెప్టెన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ర్యాంకింగ్స్ లో మరింత దిగజారాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో హిట్ మ్యాన్ 31వ స్థానంలో నిలిచాడు. ఇటీవల బ్యాటింగ్ లో విఫలమవుతున్న రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్ లో ఏకంగా 6 స్థానాలు పతనమయ్యాడు. అనేక టెస్టుల్లో మరపురాని ఇన్నింగ్స్ లు ఆడిన ఈ డాషింగ్ బ్యాట్స్ మన్ కనీసం టాప్-30 లేకుండా పోవడం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఈ జాబితాలో ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. తన దేశానికే చెందిన జో రూట్ ను వెనక్కి నెట్టి ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకుల్లో హ్యారీ బ్రూక్ అగ్రస్థానానికి ఎగబాకాడు.
టీమిండియాలో ఇతర బ్యాటర్ల విషయానికొస్తే... కోహ్లీ 5 స్థానాలు పతనమై 20వ ర్యాంకులో... రిషబ్ పంత్ 3 స్థానాలు పతనమైన 9వ ర్యాంకులో నిలిచారు. యశస్వి జైస్వాల్ 4వ ర్యాంకులో కొనసాగుతుండగా... శుభ్ మాన్ గిల్ 18 నుంచి 17వ ర్యాంకుకు ఎగబాకాడు.
టెస్టుల్లోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి ఏకంగా 6 స్థానాలు మెరుగుపర్చుకుని 69వ స్థానానికి చేరాడు. టీమిండియాలో లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వస్తున్న నితీశ్... దూకుడుగా ఆడుతూ కీలక ఇన్నింగ్స్ లు నమోదు చేస్తుండడం తెలిసిందే.